భూగర్భజలాలు అడుగంటి పొలాలు ఎండిపోతున్నాయి. సాగునీళ్లు అందక బీటలు వారుతున్న పంటలను చూసిన రైతులకు కన్నీళ్లే దిక్కవుతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నా విడుదల చేయకపోవడంతో చెరువులకు నీళ్లు రాక ఎండిపోయి వరి చేలల్లోకి పశువులను మేత వదలాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంతో పాటు చాలాచోట్ల 500 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు రాని దుస్థితి నెలకొంది. సమైక్య రాష్ట్రంలో బీళ్లుగా మారిన పంట పొలాలు స్వరాష్ట్రంలో కేసీఆర్ చొరవతో పచ్చగా మారి కోనసీమను తలపించగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మళ్లీ ఎన్కటి రోజులే దాపురించాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లు లేక అల్లాడుతున్న రైతులు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటూ ఈ కరువు పరిస్థితులు ఎప్పుడు పోతాయోనని ఎదురుచూస్తున్నారు.
– పాలకుర్తి/ దేవరుప్పుల/ జనగామ రూరల్/ పర్వతగిరి, ఫిబ్రవరి 11
Ground Water | జనగామ జిల్లా పాలకుర్తి మండలం అంతటా బోర్లు భూగర్భ జలాలు లేక అడుగంటుతున్నాయి. నీళ్లు లేక వరి పొలాలు బీటలు వారుతున్నాయి. మండలకేంద్రానికి చెందిన చెవ్వ సోమయ్యకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఎకరన్నరంలో వరి వేశాడు. అర ఎకరంలో కూరగాయలను సాగు చేశాడు. సాగునీటి కోసం రెండు బోర్లు వేశాడు. గతేడాది ఓ బోరు 350 ఫీట్లు వేయగా, ఈ ఏడాది 550 ఫీట్ల వరకు వేశాడు. రెండు బోర్లలో నీళ్లు పడలేదు. దీంతో తాను వేసిన ఎకరన్నర వరి పొలం బీటలు వారి ఎండుతున్నది. కూరగాయల పంట కూడా ఎండిపోతుండడంతో సోమయ్య కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. గతంలో పదేళ్ల క్రితం పంటలు ఎండి కరువును చూశాం. ఈ ఏడాది కూడా పంటలు పండక కరువును చూస్తున్నాం. భూగర్భ జలాలు అడగంటడడంతో బోర్లలో చుక్క నీరు లేని పరిస్థితి దాపురించింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండేదని రైతులు చెబుతున్నారు. అలాగే దేవరుప్పుల మండలం సీతారాంపురం జటంగి కుంట కింద రైతుల వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. కుంటలో నీరు లేక భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. బోర్లు కొన్ని సెకండ్ల వరకే నీళ్లు పోస్తున్నాయి. దేవాదుల నీరు విడుదల చేసి చెరువులు నింపుతారన్న నమ్మకంతో వరినాట్లు పెట్టామని, తీరా నీరు రాక పంటలు ఎం డుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నవంబర్ నెల లో నీరు వదలగా చెరువులకు చేరిందని, దీంతో బోర్లు పోశాయ ని, అదే నమ్మకంతో యాసంగి వరి నాట్లు వేసినట్టు ఆయకట్టుదారులు తెలిపారు. తీరా ఫిబ్రవరి వచ్చినా నీరు వదలకపోవడంతో పనులు మందుకు సాగడం లేదన్నారు. చెరువు కింద 60 ఎకరాల తరి ఆయకట్టు ఉండగా, బోర్లు అడుగంటి పెట్టినకాడికి ఎండే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొ రవ చూపితే కొన్ని పంట పొలాలైనా చేతికి వస్తాయని, ఆలస్యమైతే పుట్టి మునుగుడేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాల్వలు తవ్వి గోదావరి జలాలు విడుదల చేయడంతో మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకేవి. వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంల్లో ఏడాదంతా పుష్కలంగా నీరుండేది. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లు నీటితో కళకళలాడేవి. దీంతో భూములన్నీ పచ్చని పొలాలతో కోనసీమను తలపించేవి. రిజర్వాయర్లు, చెరువుల నిండా నీళ్లుండడంతో రైతులు పడావు పడ్డ భూములను సైతం సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనులు చేసేవారు. కాంగ్రెస్ సర్కారులో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఎక్కడి పొలాలు అక్కడే పంటలు సాగుచేయక మళ్లీ పడావుగా మారి తెలంగాణ రాకముందటి రోజులను తలపిస్తున్నాయి.
రైతులు వరి నాట్లు వేసే సమయంలో బోరు బావులు, బావు ల్లో నీరుంది. పంట చేతికొచ్చే సమయం వరకు నీరు సరిపోతుందని, కాల్వల ద్వారా గోదావరి జలాలు విడుదల చేస్తారనే నమ్మకంతో సాగు మొదలుపెట్టారు. బోరు బావులు అడుగంటి, కాల్వల నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఒకవైపు వరినాట్లు వేస్తుండగా, మరోవైపు వేసినవి ఎండిపోతున్నాయి. రైతు భరోసా రాక, పూర్తిగా రుణమాఫీ కాక అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. 800 నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోర్లు వేసినా చుక్క నీరు బయటకు రావడం లేదు. అప్పులు తెచ్చి రైతులు బోర్లు వేస్తుండడంతో మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేయకపోవడంతో వరి పొలాలకు నీరందక, బోరు బావులు అడుగంటి పంటలు కళ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేక రైతులు కన్నీరు పెడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకొని కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జనగామ మండలంలోని పెద్దరాంచర్ల, సిద్దెంకి, పెద్దపహాడ్, ఎర్రకుంట తండా, ఎల్లంల, పెంబర్తి ఓబుల్‌కేశ్వాపూర్, చౌదర్పల్లి గ్రామాల్లో పంటలు ఎండిపోతుండడంతో రైతులు వాటిని జీవాలకు వదిలేస్తున్నారు. సిద్దెంకిలో జన్నె రాములు, ముస్త్యాల వెంకటయ్య, కేమిడి లక్ష్మయ్య, రాగుల నర్సయ్య, బిట్ల రవీందర్‌రెడ్డి, పెద్దరాంచర్లకు చెందిన పొన్నాల ప్రభాకర్ రెడ్డి, పలు గ్రామాల రైతులు వరి పంటలో పశువులను మేపుతున్నారు.
ఎగువ నుంచి నీరు రాక, ఎస్ఆర్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు బీడుబారుతున్నాయి. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నుంచి పారే ఆకేరు వాగుతోపాటు, ఎస్ఆర్ఎస్పీ కాలువ నీరు కొత్తపల్లి, ల్యాబర్తి, మీదుగా రావూరు, కల్లెడ శివారు తండాలలో చెరువులు, కుంటలు చెక్ డ్యాంలు నిండుతుండబంతో దిగువనకు నీరు నిరంతరాయంగా పారేది. దీంతో ఆకేరు వాగు సమీపంలోని చెరువులు, కుంటలకు రావూరు, కల్లెడ, గుగులోతుతండా, మోత్యాతండా, సీత్యాతండా, రోళ్లకల్, నారాయణపురం, బూరుగుమడ్ల, దూపతండాల్లో ఇంతకాలం భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. కానీ యాసంగిలో ఆకేరు వాగు ఎండిపోవడం, ఎస్సారెస్పీ నీళ్లు వదలకపోవడంతో చెరువులు, కుంటలు, వాగుల్లో నీరు లేక చుట్టుపక్కల బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. సుమారు 600 ఎకరాల్లో నీళ్లు లేక వరి పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఆచరణలోకి రాకపోవడంతో దిగులు చెందుతున్నారు.
నాకు 4.20 ఎకరాలు భూమి ఉంది. అందులో 3.20 ఎకరాల్లో వరినాటు వేసిన. 20 గుంటల మేర నీరు పారుతుండగా మిగిలి న మూడెకరాలు ఎండిపోయింది. గతంలో నాటు పె ట్టిన పొలం ఎప్పుడూ ఎం డిపోలేదు. పక్కనే గోదావరి కాల్వ ద్వారా నీరు రావడంతో పొలం మొత్తం నాటు వేసెటోళ్లం. నాకు రెం డు బోర్లున్నాయి. అందులో ఒకటి ఎండిపోయింది. మరో బోరు నీటిని పశువులకు, తాగునీటికి వాడుకొని మిగతాది పొలానికి పారిస్తున్నా. ఇప్పటికైనా కాల్వల ద్వారా సాగునీరందించి రైతులను ఆదుకోవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పంటలు ఎండిపోకుండా చూడాలి. – పొన్నాల ప్రభాకర్‌రెడ్డి, రైతు, పెద్దరాంచర్ల, జనగామ
రెక్కాడితే డొక్కాడని బతుకులు మావి. వ్యవసాయం చేస్తేనే కడుపులోకి నాలుగు మెతుకులు.. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా యి. గుండెలు అవిసిపోతున్నాయి. నాకు రెం డు ఎకరాల భూమి ఉంది. ఎకరన్నరలో వరి, అర ఎకరంలో కూరగాయలు వేశాను. నాకు రెండు బోర్లు ఉన్న వి. ఓ బోరు 550 ఫీట్లు, ఇంకో బోరును 350 ఫీట్లు వేశాను. రెండు బోర్లలో చుక్కా నీరు లేదు. కండ్ల ముందు వరి పొలం ఎండుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, దయాకర్‌రావు ఉన్నప్పుడు గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండాయి. బోర్లల్లో ఫుల్ నీళ్లు ఉండేవి. సక్కని దేవుణ్ని పోగొట్టుకున్నాం. కష్టాలు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరువు వచ్చింది. చెరువులు కుంటలు ఎండాయి. బోర్లలో నీళ్లు లేకుండా పోయాయి. వరిపోతే ఉరి తప్పదు. ప్రభు త్వం ఇప్పటికైనా గోదావరి జలాలు విడుదల చేయాలి.
– చెవ్వ సోమయ్య రైతు, పాలకుర్తి
జటంగి కుంటల నీళ్లు ఉంటేనే బోర్లు పోస్తయ్. పంటలు పండుతయ్. నవంబర్ నెలలో దేవాదుల నీరు వదిలి రైతులకు ఆశ చూపిం డ్రు. చెరువులకు నీళ్లొచ్చుడుతోని యాసంగి నాట్లు పెట్టిం డ్రు. మళ్ల ఒకసారి చెరువులు నింపితెనే వడ్లు పండుతయ్. లేకపోతె పొలాలు ఎండుతయ్. నీళ్ల వస్తాయన్న భరోసాతోనే పొలం దున్నిన. బోర్లు ఆగి పోసుడుతోని దున్నిన మళ్లు ఎండబెట్టిన. రెండెకరాలు పారుతదని నాటేస్తె అది కూడా ఎండుతున్నది. ఇవ్వాళ, రేపట్ల చెరువులకు నీళ్లొస్తె ఒడ్లు పండినట్టు.. లేకపోతే ఎండినట్టే..
– బస్వ వెంకన్న, రైతు, జటంగికుంట ఆయకట్టుదారు, దేవరుప్పుల మండలం
ఆకేరు వాగు ఎగువ నుంచి సాగు నీళ్లు రావడం లేదు. పంటలు ఎండిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి గతేడాది డిసెంబర్ 25న తీసుకెళ్లాం. మూడు రోజుల్లో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు పరిష్కారానికి నోచుకోలేదు.
– దొమ్మాటి లక్ష్మీనారాయణ, రైతు, రావూరు
సాగు నీటి ఇబ్బందులు ఎదురైతే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మా గోస ఎవ్వరికి పట్టడం లేదు. చూస్తాం. చేస్తామంటున్నారు. కానీ ఇంత వరకు చుక్కా నీరు పైనుంచి విడుదల కాలేదు. దీంతో పంటలు బీళ్లుగా మారుతున్నాయి.
– బానోత్ కోట నాయక్, రైతు, మోత్యా తండా