ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఆవిరైపోతున్నది. చీడ పీడల నుంచి పంటలను కాపాడుకోలేక అన్నదాతలు దిగులు చెందుతున్నారు. యూరియా కొరతతో కొంత అక్కరకు రాకుండా పోగా మిగిలిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కంటిమీద కునుకు లేకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. వరి పంటలో సుడిదోమ, అగ్గి తెగులు తీవ్రతతో ఆందోళనకు గురవుతున్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు, యూరియా కొరత, తెగుళ్ల ఉధృతి వల్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
యూరియా కొరతతో పాటు అకాల వర్షాలు రైతులను కోలుకోని దెబ్బతీశాయి. నిన్న, మొన్నటి దాక యూరియా కోసం అరిగోస పడగా, అదునుదాటిన తర్వాత దొరికింది. యూరియా సకాలంలో దొరకక పంటంతా నాశనమయ్యింది. ప్రస్తుతం వరి పంట పొట్ట, కంకి దశకు చేరుకోగా ఎండు తెగులు, పాము పొడ, కంకినల్లి, సుడిదోమలాంటివి సోకి పంటను నాశనం చేస్తున్నాయి.
ఈ దఫా కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో పంటలు బాగా పండుతాయనుకున్న రైతుల ఆనందాన్ని వివిధ రకాల తెగుళ్లు హరించి వేశాయి. దోమపోటు, అగ్గితెగుళ్ల నివారణ కోసం వ్యవసాయాధికారులు సూచించిన మందులను పిచికారి చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో వరి పైర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి.
తెగుళ్లు సోకిన పంటలు ప్రస్తుతం ఎండిపోయి పశుగ్రాసానికి సైతం ఉపయోగపడకుండా తయారయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్ల వల్ల ఈసారి దిగుబడులు తగ్గే ప్రమాదముందని వాపోతున్నారు. వరంగల్ జిల్లాలో 1,30,376 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పంట దోమపోటుకు గురికావ డం వల్ల వారి కంట్లో కన్నీళ్లే మిగిలాయి. ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఏపుగా పెరిగినప్పటికి మసిపేను సోకడంతో ఎర్రబారి నేలవాలింది. ప్రభుత్వం ఆదుకొని పంట నష్టపరి హారం చెల్లించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
రైతులంతా వరిపంటపై ఆధారపడి బతుకుతున్నరు. ముఖ్యంగా వర్షాకాలంలో తెగుళ్ల ప్రభావంతో పంట నష్టపోతున్నరు. వేల రూపాయల పెట్టుబుడులు పెట్టినా చేతికి అందకుండా పోయాయి. యూరియా దొరకకపోవడంతో పాటు చీడపీడలు ఆర్థికంగా దెబ్బతీశాయి. పండిన కొంత పంట ప్రస్తుతం చీడపీడల వల్ల అక్కరకు రాకుండా పోయింది.
– దండిగ రమేశ్, రైతు, కమలాపురం