రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. అందరికీ మాఫీ చేస్తామని చెప్పి దగాచేసిన కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో అన్నదాతలకు మద్దతుగా గురువారం ఉమ్మడి జిల్లా అంతటా ధర్నాలు నిర్వహించగా ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులతో కలిసి నిరసనలతో హోరెత్తించారు.
మొదటి విడుత నుంచి కోతలు, ఎగవేతలు, రోజుకో తీరు ప్రకటనలతో ఆగం చేస్తూ బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతు వేదికల చుట్టూ తిప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ మోసపూరిత వైఖరిపై భగ్గుమన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, రైతులు బైఠాయించగా రేవంత్ డౌన్ డౌన్ నినాదాలు మిన్నంటాయి. ‘కాంగ్రెస్ నాటకం.. రుణమాఫీ బూట కం’.. ‘కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ రైతన్న’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ ధర్నాలతో అన్ని జిల్లాలు దద్దరిల్లగా షరతులు లేకుండా అర్హులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
– నమస్తే నెట్వర్క్, ఆగస్టు 22
జనగామ జిల్లాకేంద్రంలో తలపెట్టిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు దేవీప్రసాద్, రాకేశ్‌రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. అలాగే తొర్రూరు, వర్ధన్నపేట, రాయపర్తి మండలకేంద్రాల్లో రాస్తారోకోలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొనగా బయ్యారంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మరిపెడలో మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు ఎదుట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, పరకాల, గీసుగొండ మండలం ఊకల్ సొసైటీ ఎదుట మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, వరంగల్ పోస్టాఫీస్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని రైతుకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.