వరద పోటుకు పంట చేలు, చెరువులు నామరూపాల్లేకుండా మారాయి. అతి భారీ వర్షాలతో పొలాల్లో ఇసుక మేటలు, తారురోడ్డు ముక్కలుచెక్కలై కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉధృతికి చెరువులకు గండ్లు పడి నీరంతా వృథా పోవడంతో నేలంతా మైదానంలా మారి పెద్ద పెద్ద రాళ్లు తేలాయి.
ఇలా మొన్నటి ప్రకృతి బీభత్సానికి మానుకోట జిల్లాలో 85 చెరువులు తెగిపోవడంతో జలవనరులన్నీ ఖాళీ కాగా, చాలాచోట్ల పంటలను ముంచేసి, ఇసుక మేటలు వేసి రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. ఇలా పంటలను కోల్పోయి, సాగుభూమి అక్కెరకు రాకుండా కావడం అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే దీంతో ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.
– మహబూబాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ)
భారీ వర్షాలతో మానుకోట జిల్లాలో గ్రామాలు, తండాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే చాలాచోట్ల ఇళ్లు కూలిపో యి, కొన్ని బురద నీటి పాలు కాగా సామగ్రి, నిత్యావసరాలు, పశువులు, గేదెలు, గొర్రెలన్నీ వరద పాలయ్యాయి. వరదలతో జిల్లాలో 85 చెరువులు గండ్లు పడ్డాయి. వీటిలో 40 పూర్తిగా తెగిపోయాయి. అలాగే చెలకల్లోకి ఉప్పెనలా వచ్చిన వరదతో పత్తి, మిర్చి, వరి, మకజొన్న తదితర పంటలన్నీ కొట్టుకుపోయాయి.
పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు వచ్చి చేరి లక్షలు పోసి పెట్టుబడి పెట్టిన రైతులకు అంతులేని నష్టాన్ని మిగిల్చింది. వాటిని తొలగించి, సాగుకు అనుకూలంగా మార్చుకోవడం రైతులకు కత్తి మీద సామూలా మారింది. వీటిని రైతులు తొలగించాలంటే ఖర్చుతో కూడిన పని. వరద నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులు తాతాలిక ఉపశమనం కోసం ఓదార్చడం తప్ప వారు కన్నీళ్లు తుడిచింది లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరాకు చెల్లిస్తామని చెప్పిన రూ.10వేలు ఏ మూలకు సరిపోతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.