కొంతకాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న నేరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతి, హద్దులు దాటి వ్యవహరిస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. నేరస్తులు, రౌడీలీడర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. పేద, సామాన్యులు కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్లను కబ్జాదారులు కాజేస్తున్నారు. బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ న్యాయం జరగడం లేదు. హత్యలు, హత్యాయత్నాలు, స్నాచింగ్‌లు, దోపిడీలు, గంజాయి, గుట్కా, పీడీఎస్ అక్రమ రవాణా, చిట్‌ఫండ్ సంస్థల మోసాలు.. ఈ సమస్యలన్నీ కొత్త పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌కు సవాళ్లుగా మారనున్నాయి.
– సుబేదారి, మార్చి 26
కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్లో చాలా మంది ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు సుదీర్ఘకాలంగా పనిచేశారు. ఇందులో కొందరు కాసుల కోసం కక్కుర్తిపడి పోలీసు శాఖకు మచ్చ తెస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 10 వరకు కొత్త బాస్ రాక ముందు ఇటీవల రోడ్లపై హత్యలు, హత్యాయత్నాలు, 36 చోరీలు,6 చైన్‌స్నాచింగ్‌లు, 48 గంజాయి, 22 లైంగిక దాడి,19 మహి ళల కిడ్నాప్, 91 వేధింపు కేసులు నమోదయ్యాయి.
ఈ నేరాల నియంత్రణకు సహకరించకుండా కొందరు అధికారులు భూకబ్జాదారులు, పొలిటికల్ రౌడీలీడర్లు, రౌడీషీటర్లు, గుట్కా, పీడీఎస్ దందాలు చేసే వారి సంబంధాలు పెట్టుకొని నెలవారీ సంపాదనకు మరిగారు. కొందరైతే ఏకంగా పోస్టింగ్‌లు ఇప్పించిన నేతలు, వారి అనుచరులు ఆదేశాల మేరకే విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ నగరంలో ఓ ఏసీపీ, ఆరుగురు ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల అనుచరులతో సంబంధాలు పెట్టుకొని సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.
ఈస్ట్‌జోన్ పరిధిలోని పరకాల, మామునూరు, నర్సంపేట డివిజన్ల పరిధిలోని ఓ ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ జోన్ పరిధిలోని పనిచేస్తున్న ఓ ఏసీపీ, ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలున్నాయి. సదరు ఏసీపీ హద్దులు దాటి వ్యవహరించిన తీరు పత్రికల్లో వచ్చినా ఎలాంటి చర్యలు లేవు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్న వాహనాల యజమానుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్‌లో ఇక్కడే పాతుకుపోయిన కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితుల నివేదికలను కమిషనర్, ప్రభుత్వానికి పంపించడం లేదనే విమర్శలున్నాయి.
టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు, సిబ్బంది కూడా గుట్కా, గంజాయి విక్రయదారులు, బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడే రైస్‌మిల్లర్స్, పీడీఎస్, కల్తీ సరుకుల దందాలు చేసే వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకొని, దాడులు చేసే క్రమంలో ముందుస్తుగా లీకులు ఇచ్చి సేఫ్జోన్లో ఉండేలా సహకరిస్తున్నట్లు సమాచారం. ఇక తూతూమంత్రంగా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇన్స్పెక్టర్లు చాలా వరకు నగరంలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు ఇన్స్పెక్టర్లు ఇష్టానుసారంగా రావడం పోవడంతో రోజుల తరబడి బాధితులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.
రౌడీలీడర్లతో చెట్టాపట్టాల్
నగరంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు రౌడీలీడర్ల ఆదేశాల మేరకు నడుచుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు,రౌడీలీడర్లు భూ పంచాయతీలు,ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ల కోసం ఫోన్ ఆదేశాలతో అనుచరులను ముందు పెట్టి స్టేషన్‌కు పంపిస్తున్నారు. హౌస్ ఆఫీసర్ ఎంత బీజీలో ఉన్నా వారిని వెంటనే సీట్లో కూర్చోబట్టి సెటిల్మెంట్ డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ఇవి నగరంతోపాటుగా రూరల్ ఏరియాల్లో కూడా జరుగుతున్నాయి.
హత్య లు, హత్యాయత్నాలు, దాడులు, భూ కబ్జాలకు పాల్పడి పొలిటికల్ ముసుగు వేసుకొని దందాలు చేసే రౌడీషీటర్లను పోలీసులు మందలించడం లేదు. వీరికి ప్రజాప్రతినిధుల సపోర్ట్ ఉండడంతో వారి దందాలకు చెక్ పెట్టలేకపోతున్నారు. కాగా, ఇటీవల సీపీ బాధ్యతలు చేపట్టిన సన్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు, అధికారుల పనితీరుపై ఫోకస్ పెట్టారు. తొలుత లా అండ్ ఆర్డర్‌ను పూర్తిస్థాయిలో ట్రాక్‌లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. వాస్తవ పరిస్థితిని తెలుసు కొని అవినీతి, నిబంధలు అతిక్రమించిన వారిపై పట్టుబిగించే ప్రయత్నంలో ఉన్నారు.