సుబేదారి, డిసెంబర్ 26: ఈ ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగికదాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం 2023లో క్రైమ్‌రేట్ 7.7శాతం పెరిగినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ 2023 ఏడాది నేర వార్షిక నివేదికను మీడియా సమావేశంలో విడుదల చేశారు. గతేడాది 135 లైంగిక దాడి కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 184కి పెరిగాయి. వాటిలో మహిళలపై 18శాతం, చిన్నారులపై పోక్సో కేసులు 36శాతం పెరిగాయి. భూ వివాదాలు, చిట్‌ఫండ్స్ వంటి వైట్‌కాలర్ నేరాల కేసులు గతేడాది 1500 కాగా, ఈ ఏడాది 1994 నమోదయ్యాయి. భూ వివాదాల సంఖ్య ఈ ఏడాది మరింత పెరుగగా చీటింగ్ కేసులు 33శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు గతేడాది 1,149 రోడ్డు ప్రమాదాలు కాగా, 438 మంది మృత్యవాతపడ్డారు. ఈ ఏడాదిలో 1,526 రోడ్డు ప్రమాదాలు కాగా, 487మంది మృతిచెందారు. ఈ ఏడాది 32శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. డ్రైంక్ అండ్ డ్రైవ్ కేసులు 39శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు 36శాతం ఎక్కువయ్యాయి.
క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, చిన్నారుల పోక్సో కేసులు పెరగడం బాధాకరమని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. 1,167 మంది ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో 90శాతం ట్రేస్ చేసినట్లు చెప్పారు. వరంగల్ అర్బన్‌లో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో రూ.12కోట్లు పట్టుకున్నామని, గంజాయి ఇతర కేసుల్లో 18మందిపై పీడీ యాక్ట్‌లు పెట్టామని వివరించారు. ఇంటి వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేసేవారిపై జాగ్రత్తగా ఉండాలని, భూకబ్జాలు, చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్స్‌పై ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, 31న డ్రంక్ అండ్ స్పెషల్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్త్తామని తెలిపారు. డీసీపీలు బారీ, రవీందర్, సీతారాం, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.