హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22 : అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దయాదుల మధ్య హోరాహోరీ ఫైట్ జరుగనున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. పాక్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్స్ చీల్చి చెండాడుతుంటే చూడాలని ప్రతి ఒక భారత క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటారు. పాక్‌పై గెలిచిన విజయ గర్వాన్ని చూడాలని ఆశపడుతుంటారు.
ఇప్పటికే బంగ్లాతో గెలిచిన టీమిండియా అదే ఉత్సాహంతో దుబాయ్‌లో పాక్‌తో తలపడనున్నది. వన్డేల్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా భారత్‌దే ఆధిపత్యం. దీంతో హాట్ ఫేవరేట్‌గా భారత్, పాక్ రంగంలోకి దిగుతున్నాయి. కాగా, మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఆదివారం కలిసిరావడంతో ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూసేలా రిసార్టులు, హోటళ్లలో ముందుగానే రూమ్‌లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. టీం ఇండియా తన తొలి మ్యాచ్ బంగ్లాపై విజయం సాధించగా పాక్ మాత్రం కివీస్ చేతిలో ఘోరపరాభవం ఎదుర్కొన్నది.
ఈ మ్యాచ్‌లో పాక్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతున్నది. మరోవైపు పాక్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఇందులో ఓడితే డిఫెండింగ్ చాంపియన్ ఇంటిముఖం పట్టాల్సిందే. టోర్నీ అంతా ఒకెత్తు అయితే.. దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత్ తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తు.. ఇదిలా ఉంటే ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆన్లైన్లో టికెట్లు పెట్టిన కొద్ది నిమిషాల్లో అమ్ముడుపోవడం చూస్తే అభిమానుల్లో ఏ రేంజ్ ఎదురుచూస్తున్నారో తెలుస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.