హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బం ధం’.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్, బీజేపీదే అ త్యంత దృఢమైన ఫెవికాల్ బంధమని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదు.. ఒక్కటే అనేది తేలిపోయింది. ఢిల్లీలో ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూనే రాష్ట్రంలో నిస్సిగ్గుగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. అధికారం కోసం రాజకీయ విలువలకు తిలోదకాలు వదులుతున్నా యి. బీఆర్ఎస్ను నిలువరించడమే లక్ష్యంగా రెండు పార్టీలు అనైతిక పొత్తులు కుదుర్చుకున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సంపూర్ణగా సహకరించుకున్నాయి. చాలాచోట్ల కాంగ్రెస్‌కు బీజేపీ కౌన్సిలర్లు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇలా రెండు పార్టీల మధ్య అనైతిక, అక్రమ బంధం ప్రజల ముందు బహిర్గతమైంది.
బీజేపీ మద్దతుతో కాంగ్రెస్‌కు అధికారం
బద్ద వ్యతిరేక పార్టీలుగా పేరున్న కాంగ్రెస్, బీజేపీ అధికారం కోసం అనైతిక పొత్తులకు పాల్పడ్డాయి. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పలు మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులను దక్కించుకోవడం ఆ రెండు పార్టీల అక్రమ బంధానికి సాక్ష్యంగా నిలిచింది. ‘నవ్విపోదురు గాకా నాకేటి సిగ్గు’ అనే సామెత చందంగా ప్రజలు నవ్వుకుంటారనే ఇంగితం కూడా లేకుండా జాతీయ పార్టీలు అక్రమ బంధాలకు తెరలేపాయి. బీజేపీకి అవసరమైన చోట కాంగ్రెస్, కాంగ్రెస్‌కు అవసరమైన చోట బీజేపీ సహకరించింది. పరస్పర సహకరానికి బదులుగా పదవులు పంచుకున్నాయి. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు లేకున్నా బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పదవులను దక్కించుకున్నది.
ఇందుకు మెట్పల్లి, నర్సాపూర్, మెదక్, ఆమనగల్లు, అలియాబాద్, కాగజ్‌నగర్‌లో ఫలితాలే నిదర్శనంగా నిలిచా యి. మెట్పల్లిలో బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీన కాంగ్రెస్‌కు మద్దతు తెలుపడంతో మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకున్నది. నర్సాపూర్‌లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నది. మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో బీజే పీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. చాలా చోట్ల కాంగ్రెస్‌కు చైర్మ న్ పీఠం దక్కేందుకు బీజేపీ నిస్సిగ్గుగా మద్దతిచ్చింది. కొన్నిచోట్ల కాంగ్రెస్‌కు చైర్మన్ పీఠాన్ని ఇప్పించిన బీజేపీ.. వైస్ చైర్మన్ పదవులను తీసుకున్నది. ఇందుకు ఆమనగల్లు, అలియాబాద్, మెట్పల్లి ఫలితాలే సాక్ష్యంగా నిలిచాయి. పొత్తులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ పదవులు తీసుకోగా.. బీజేపీ వైస్ చైర్మన్ పదవులను తీసుకున్నది.
బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఒక్కటై
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందంటూ కాంగ్రెస్, బీజేపీ పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాయి. కానీ ఆ పార్టీలకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దడ పుట్టించా యి. ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఓట్లు, సీట్లు కాంగ్రెస్, బీజేపీలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అప్పటికే భవిష్యత్తు అవసరాల కోసం లోపాయికారి ఒప్పందం చేసుకున్న ముఖ్యనేత, బీజేపీ నేతలకు బీఆర్ఎస్పై ప్రజలు చూపుతున్న ఆదరణ కంటగింపుగా మారింది. దీంతో ఎలాగైనా బీఆర్ఎస్ను నిలువరించే కుట్రలకు తెరలేపాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక చైర్మన్ పదవులు దక్కించుకోకుండా చూడాలని కుట్రలు పన్నాయి. ఒక్క బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనైతిక బంధంతో ఏకమయ్యాయి. వైపు రాజకీయ విరోధులుగా డ్రామాలాడుతూ మరోవైపు అవసరం కోసం అనైతిక బంధాలు కలుపుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల కలయికను సొంత పార్టీ నేతలు చీకొడుతుండటం గమనార్హం.
నర్సాపూర్‌లో కాంగ్రెస్‌కు చైర్మన్..బీజేపీకి వైస్ చైర్మన్
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 5 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు బీజేపీ గెలుచుకున్నది. ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ నర్సాపూర్ మున్సిపాలిటీని దక్కించుకున్నది. చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకోగా, వైస్ చైర్మన్ పదవిని బీజేపీ తీసుకున్నది.
మెదక్‌లో కాంగ్రెస్‌కు లోపాయికారి మద్దతు
మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా, 15 వార్డుల్లో బీఆర్ఎస్, 14 వార్డు ల్లో కాంగ్రెస్, రెండు వార్డుల్లో బీజేపీ, ఒక వార్డులో బీఎస్పీ గెలిచింది.అక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 ఎవరికీ రాలేదు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 15కి పెరిగింది. కాంగ్రెస్ కోసం ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు బయటికి వెళ్లిపోవడంతో సభలో మ్యాజిక్ ఫిగర్ 16కు తగ్గింది. బీఎస్పీ సహకారంతో మెదక్ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. హాలు నుంచి బయటికి వెళ్లిపోవడం ద్వారా బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది.
అలియాబాద్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది. ఇందుకు ప్రతిఫలంగా బీజేపీకి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. మున్సిపాలిటీకి 20 వార్డులుండగా 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, 2 ఇతరులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 11 కాగా ఎనిమిది మంది వార్డు సభ్యులున్న కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యులున్న బీజేపీ మద్దతిచ్చింది. ఇందుకు బహుమతిగా బీజేపీ వైస్ చైర్ పర్సన్ పదవిని దక్కించుకున్నది.