బచ్చన్నపేట ఆగస్టు 12 : సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ అన్నారు. మంగళవారం సిపిఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి కొడవటూరు కమాన్ వరకు గుంతలమయమైన రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ బచ్చన్నపేట మండల కేంద్రంలోని రోడ్డు యాదాద్రి భువనగిరి జిల్లా సిద్దిపేట జిల్లా జనగామ జిల్లాలను కలుపుతూ ఉన్న రోడ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. రోడ్లు సరిగా లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వర్షాలకు ధ్వంసమైన నేషనల్ హైవే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలన్నారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, మండల నాయకులు రామగళ్ళ అశోక్, సమ్మయ్య, మురళి, శోభ, సుధాకర్, మైబెల్లి భాస్కర్, కిష్టయ్య చారి, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.