కాశీబుగ్గ, అక్టోబర్15 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మంగళవారం పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ నెల నుంచి మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా మంగళవారం రూ. 6,900 పలికింది. తేమ అధికంగా ఉండడం వల్లే ధర తగ్గుతున్నదని అధికారులు తెలిపారు. రైతులు పత్తిని ఆరబెట్టుకొని వస్తే మద్దతు ధర వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మంగళవారం 1,592 బస్తాలు రాగా లూజు 37 క్వింటాళ్లు వచ్చినట్లు తెలిపారు. గరిష్ఠంగా రూ. 6,900, మధ్య రకం రూ. 6,350, కనిష్ఠంగా రూ. 5 వేలు ధర పలికింది. గత ఏడాది అత్యధికంగా క్వింటాకు రూ. 7,160 రాగా, ఈ సీజన్ ప్రారంభంలో రూ.7 వేల వరకు ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో దూదికి డిమాండ్ లేకపోవడంతో నిల్వలు పెరిగిపోయాయని, దీంతో ధర తగ్గే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు తేమ 15 నుంచి 30 శాతం వరకు ఉంటుందన్నారు.
భారత ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే టెండర్లు ఖరారైనట్లు సమాచారం. అలాగే వరంగల్ మార్కెట్ కమిటీ పరిధిలో 27 జిన్నింగ్ మిల్లులుండగా అందు లో ఆధునికమైన 13 టీఎంసీ మిల్లులను నోటిఫై చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ సిబ్బంది 10 టీఎంసీ మిల్లుల్లో సీసీఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసినట్లు సమాచారం.