సీసీఐ తీరుతో పత్తి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన దూదిని అమ్ముకుందామంటే తేమ పేరుతో తిరస్కరిస్తుండడంతో విధిలేక అడిగిన కాడికి ప్రైవేట్ వ్యాపా రులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. జనగామ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ్రప్రైవేట్ మిల్లుల్లోనే ఓ వైపు సీసీఐ, మరోవైపు దళారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
తేమ సాకుతో సీసీఐ కొనకపోవడంతో రైతులు పత్తిని వేరేచోటకు తరలించడానికి వాహన కిరాయి భారమని భావించి అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది. అక్కడ రిమోట్‌తో తెలివిగా తూకంలో మోసం చేస్తున్నారు. అనంతరం అదే పత్తిని సీసీఐకి విక్రయి స్తున్నారు. అదేవిధంగా 2 శాతం కమీషన్ సహా అన్లోడింగ్ చార్జీల పేరుతో మిల్లుల నిర్వాహ కులు, ప్రైవేట్ వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నారు.
– జనగామ, నవంబర్8(నమస్తే తెలంగాణ)
జనగామ వ్యవసాయ మార్కెట్ మినహా సీసీఐ ప్రారంభించిన పత్తి కొనుగోలు కేంద్రాలన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాటన్, జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేశారు. ఒకవైపు సీసీఐ, మరోవైపు ప్రైవేటు కొనుగోళ్లు జరుగు తుండటంతో తేమ వంటి సాకుతో ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ తిరస్కరిస్తున్న పత్తిని ప్రైవేట్ వ్యా పారులు కొంటున్నారు. ట్రాక్టర్ లేదా ఆటో, డీసీఎం వాహనం లో రైతులు తెచ్చిన పత్తిని సీసీఐ కేంద్రంలో సిబ్బంది తేమ పరీక్ష చేసి తిరస్కరిస్తుండడం తో రవాణా ఖర్చు (వాహన కిరాయి) భారం గా భావిస్తున్న రైతులు వేరేచోటకు తరలించలేక అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యా పారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు.
ఒకే మిల్లులో ఒకవైపు ప్రైవే ట్ కొనుగోళ్లు జరుగుతుండగా మరోవైపు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తుండడంతో అక్కడి పర్చేజింగ్ అధికారులు, సిబ్బందితో ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై రైతును ముంచుతున్నారు. సీసీఐ తిరస్కరించిన పత్తిని మిల్లుల్లో, బయట చిల్లరకాంటా వ్యాపారులు, దళారులు కొని తిరిగి అదే పత్తిని రైతుల పేరిట సీసీఐకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో పేరుకే 10 ప్రాంతా ల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ఐదా రు కేంద్రాల్లో మాత్రమే పూర్తిస్థాయి లో పత్తి కొనుగోళ్లు జరుగుతుండగా, మిగిలిన కేంద్రా ల్లో క్వింటాలు పత్తి కూడా కొనుగోలు చేయలేదు. విధిలేని పరిస్థితిలో ప్రైవేట్‌లో దళారులు చెప్పిన ధరకు అమ్ముకొని పంటకు పెట్టిన పెట్టుబడి వెళ్లక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు నష్టపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న ఏ-గ్రేడ్ పత్తి క్వింటాల్‌కు రూ.7,521, 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే ఒక్కో శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలని నిర్ణయిం చింది. ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు. మార్కెట్‌కు అమ్మకానికి తెస్తే అయితే సీసీఐకి లేదంటే ప్రైవేట్‌కు అమ్ముకొని ఇంటికి పోవాల్సిందే. ఒకసారి ఇంటి నుంచి వాహనంలో తెచ్చిన పత్తిని మళ్లీ తీసుకుపోవాలంటే కిరాయి మీద పడి రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో తేమ, పత్తి నల్లబారిపోయిందనే సాకుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటా ల్కు రూ.1,000 నుంచి రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
ప్రైవేట్ మార్కెట్లో పత్తిరైతులు నిలువుదోపిడీకి గురువుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఎలక్ట్రానిక్ కాంటాల వినియోగంలో వ్యాపారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. రిమోట్‌ను జేబులో పెట్టుకొని రైతులకు తెలియకుండా తెలివిగా ఒక్కో తూకంలో 5 నుంచి 10కిలోల తక్కువ చూపించి మోసం చేస్తున్నారు. అటు ధరలోనూ ఇటు తూకంలోనూ రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. పత్తిలో నాణ్యతా ప్రమాణాలు బాగానే ఉన్నా తేమ యంత్రాల మాయాజాలంతో రైతులను నమ్మించి ధర తక్కువ చేసి అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో చిల్లర కాంటాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. గ్రామాల నుంచి మిల్లులు, ప్రైవేట్ వ్యాపారుల వద్దకు పత్తి తీసుకొచ్చే వాహనాలకు కమీషన్ల ఆశచూపి రైతులకు చెల్లించే ధరను తగ్గిస్తున్నారు.