కృష్ణకాలనీ, జనవరి 21 : సింగరేణిలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, సైట్ విజిట్ పేరుతో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక వి ధానాలు, సింగరేణిలో జరుగుతున్న అవినీతిని నిరసి స్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆ ధ్వర్యంలో బుధవారం భూపాలపల్లి అంబేదర్ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంత రం గండ్ర మాట్లాడుతూ పరిపాలన చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ సర్కారు సింగరేణిని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. కనీసం సింగరేణి డేను జరుపుకోలే ని దీనస్థితికి తీసుకొచ్చిందన్నారు. నైని బ్లాక్‌ను గతంలో సింగరేణికి అప్పగించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని తన బావమరిదికి అప్పజెప్పేందుకు కుట్ర చేసి సైట్ విజి ట్ దందాకు తెరలేపాడన్నారు. ఈ దందాపై మాజీ మం త్రి హరీశ్‌రావు మాట్లాడినందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు పిలిచారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కారు భయపెట్టే కుట్ర చేస్తున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాళ్ల తాటాకు చప్పుళ్లకు బీఆర్ ఎస్ పార్టీ భయపడదని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు చీకటి తోడు దొంగలని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే సింగరేణిలో కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు బలవంతంగా గండ్ర దంపతులు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, టీబీజీకేస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేశ్, మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మాజీ కౌన్సిలర్లు జకం రవికుమార్, మురళీధర్, దార పూలమ్మ, నాయకులు సిద్దు, సదానందం, అవినాష్ రెడ్డి, చిరంజీవి, కుమార్ రెడ్డి, మామిడి కుమార్, రాజేందర్, అశోక్, బండారు రవి, కిషన్‌నాయక్, మహేందర్, దిలీప్‌కుమార్, తిరుపతమ్మ, స్వప్న, భాగ్య పాల్గొన్నారు.
సింగరేణిని లేకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
సింగరేణిని పూర్తిగా లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్థను అడుగడునా ముంచుతోంది. కార్మికులకు లాభాలు, కారుణ్య నియమాకాలు ఇవ్వడంలో మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మంత్రులు సింగరేణిలో చేసిన అవినీతి కేసును సీబీఐకి అప్పగించి న్యాయ విచారణ చేయించాలి.