Cool drinks | నయీంనగర్, ఏప్రిల్ 16 : రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం నుంచి చల్లబడేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కొబ్బరిబొండాలు, నిమ్మకాయ సోడా స్టాళ్లను ఆశ్రయిస్తుండడంతో ‘చల్లని’ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. దారి వెంట ఎక్కడచూసినా ఒక్కో రకమైన పదార్థాలతో ఉన్న తోపుడు బండ్లు ఎండనపోయే వారికి ఉపశమనం కలిగిస్తున్నాయి. చీకటి పడినా భానుడి భగభగ తగ్గకపోవడంతో పొద్దుపోయే వరకూ గిరాకీలు బాగా ఉంటున్నాయి.
అయితే కష్టాన్నే నమ్ముకొని ఎండను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు ‘చల్లదనం’ అందిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరంలో ఎక్కడ చూసినా శరీరాన్ని చల్లబరిచే పుచ్చకాయలు, తాటి ముంజలు, కుప్పలు కుప్పలు గా పోసి అమ్ముతున్నారు. బటర్‌మిల్క్, లస్సీ, నిమ్మకా య సోడా, పండ్లరసాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎండను సైతం లెక్కచేయక కష్టాన్నే నమ్ముకున్నందుకు గిట్టుబాటు అవుతోందని రోజుకు రూ. 3 వేల నుంచి 4వేల దాకా వస్తున్నాయని పలువురు వ్యాపారు లు చెబుతున్నారు. ఇలా సీజన్‌ను అందిపుచ్చుకొని తమదైన వ్యాపారంతో మంచి లాభాలు పొందుతున్నారు.
ఇదే సరైన సమయం
నేను సంవత్సరమంతా సోడా వ్యాపారం చేస్తాను. కానీ అన్ని కాలాల కన్నా ఈ వేసవిలోనే గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఎండను కూడా లెక్కచేయకుండా పనిచేస్తేనే పైసలు వస్తాయి. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఎండలు బాగా ఉన్నాయి. కానీ ఎండ అని చూసి నిర్లక్ష్యం చేస్తే వచ్చే బిజినెస్ కాస్త పోతుంది. సోడాను తాగేందుకు చాలా దూరం నుంచి కస్టమర్లు వస్తున్నారు.
– బింగ నాగరాజు, సోడా వ్యాపారి
గిరాకీ బాగుంది
కొబ్బరిబొండాల గిరాకీ చాలా బాగుంది. ఎండాకాలం ఎన్ని కొబ్బ రి నీళ్లు తాగితే అంతమంచిది. ప్రజ ల్లో ఆరోగ్యం విషయంలో చైతన్యం వచ్చింది. ఒకప్పుడు కొబ్బరినీళ్లు తాగాలంటే ఆలోచించేవాళ్లు. రోజురోజుకూ బిజినెస్ పెరుగుతోంది.
– గడ్డపు శివ