మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బహిరంగ మారెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. తాజాగా వివిధ కంపెనీల వంట నూనెల ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెపై సుంకాన్ని పెంచడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
కాటన్ నూనె లీటర్ ప్యాకెట్ రూ. 100 ఉండగా తాజాగా రూ. 125కు చేరింది. పామాయిల్ రూ. 100 నుంచి రూ. 125కు చేరింది. ఇక సన్ ఫ్లవర్, ఫ్రీడం, శుభం తదితర నూనెలు రూ. 110 నుంచి రూ. 115 ఉండగా ఇప్పుడు రూ.125 నుంచి రూ.130 వరకు చేరింది. ఐదు లీటర్లు నూనె డబ్బా రూ. 525 ఉండగా ప్రస్తుతం రూ. 640కు చేరింది. అంటే ఏకంగా రూ.115 పెరిగింది. ఇక 15 లీటర్ల డబ్బా రూ.300 నుంచి రూ. 350 వరకు చేరింది. నూనె ధరలు ఒకసారిగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రానున్న సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నూనె ధరలు మరింత ప్రియం కానున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సమయంలో నూనె ధరలు పెరగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెలపై సుంకాన్ని పెంచడమేమిటని ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక భారం పడుతుండడంతో పండుగలకు ఇళ్లల్లో పిండి వంటలు చేసుకోవడం కష్టమేనంటూ సామాన్య ప్రజలు నిట్టూరుస్తున్నారు.