కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనర్హులతో ఎగ్జామ్ పేపర్లు వాల్యుయేషన్ చేయించిన విషయం ఇటీవలె వెలుగులోకి వచ్చింది. ఇలాంటివే మరిన్ని జరిగినట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. యూనివర్సిటీలో తాజాగా చేపట్టిన నియామకాలూ వివాదాస్పదంగా మారాయి. సీనియర్ ఫ్యాకల్టీలున్నా అర్హత లేనివారిని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై ఇన్చార్జి వీసీ వాకాటి కరుణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆమె వివరణ కోరగా ప్రస్తుత రిజిస్ట్రార్ తప్పుడు సమాచారం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. పీహెచ్డీ లేకున్నా ఉన్నట్టు చూపించారని, రిజిస్ట్రార్ ప్రతిపాదనలతోనే తాత్కాలిక వీసీ ఆమోదం పొందినట్లు యూనివర్సిటీలో చర్చ జరుగుతున్నది. సీనియర్లను పకనబెట్టి వి వాదాలున్న వారిని అందలమెక్కించడం పై కరుణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అంశం ఆసక్తిగా మారింది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి 13 మందిని ఎంపిక చేసి ఇటీవల కిట్స్ కాలేజీలోని పలు విభాగాలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించిన అంశం వివాదాస్పదంగా మారింది. సీఎస్ఈ, ఐటీ, నెట్ వర్, ఏఐఎంఎల్, ఐవోటీ, డాటా సైన్స్ విభాగాలకు ఒక్కరినే ఎక్స్‌పర్ట్‌గా రిజిస్ట్రార్ ప్రతిపాదిస్తూ ఫైల్ తయారు చేశారని, దీన్నే ఇన్చార్జి వీసీ ఆమోదించారని చర్చ జోరుగా సాగుతున్నది. కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ విభాగంలో నలుగురు ఫ్యాకల్టీలుండగా, వారిని పట్టించుకోకుండా ఒక్కరికే కేటాయించడంలో ఆంతర్యం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు డిపార్ట్మెంట్లకు ఎక్స్‌పర్ట్‌గా నియమితుడైన ప్రొఫెసర్‌కు ప్రమోషన్ ఇచ్చే ప్రక్రియలోనూ త ప్పులు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లో ఆయనకే మరో అవకాశం ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన మరో ఫ్యాకల్టీకి పీహెచ్డీ లేకున్నా ఈసీఈ డిపార్ట్మెంట్ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌గా నామినేట్ చేసినట్లు తెలిసింది. ఇదే డిపార్ట్మెంట్లో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ ఉన్నప్పటికీ వీరిని పక్కనపెట్టడంలో మతలబు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంపైనా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఒకరితోపాటు మరో ముగ్గురు బోధనా సిబ్బందిని 2015లో ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఈ తొలగింపుపై యూనివర్సిటీ అధికారులు స్టే వెకేట్ పిటిషన్ వేయలేదు. ఈ పని చేయకపోగా తొలగించిన జాబితాలో ఉన్న వారికి అక్రమంగా జీతాలు చెల్లిస్తున్నారని యూనివర్సిటీలోని పలువురు బోధన సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికంగా ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తిని ఈసీఈ డిపార్ట్మెంట్కు ఎక్స్‌పర్ట్‌గా ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రిజిస్ట్రార్ ఉద్దేశపూర్వకంగానే ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బోర్డు ఆఫ్ స్టడీస్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ల నియామకంపై ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌కు వివరించాను. విజిలెన్స్ విచారణ కోసం అన్ని ఫైళ్లను సిద్ధం చేసి పెట్టాం. పోస్టింగ్ ఆర్డర్లో పొరపాటుగా ఒకరి ఇంటిపేరుకు బదులుగా డాక్టర్ అని పడింది. ఆరు డిపార్ట్మెంట్లకు ఒక్కరినే సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌గా నియమించడంపైనా వివరించాం. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.