తొర్రూరు, జూలై 1 : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం ప్రజలకు శాపంగా మారింది. ప్రమాదకరంగా ఉన్న లోలెవల్ కాజ్‌వేలపై బ్రిడ్జిలు నిర్మించేందుకు నిధులు మంజూరై రెండేళ్లవుతున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో పలు చోట్ల వరదల బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తొర్రూరు మండలంలోని ఆరు ప్రాంతాల్లో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 2023 అక్టోబర్‌లో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ. 18.39 కోట్లు మంజూరు చేయించారు.
ఇందులో కంఠాయపాలెం-గుర్తూర్ బ్రిడ్జి కోసం రూ. 3.52 లక్షలు, కంఠాయపాలెం-మడిపల్లి బ్రిడ్జికి రూ. 3.30 లక్షలు, చీకటాయపాలెం-హరిపిరాల బ్రిడ్జికి రూ. 2.25 కోట్లు, చర్లపాలెం-గోపాలగిరి మధ్యలో రెండు బ్రిడ్జిల కోసం రూ. 4.87 కోట్లు, అమర్‌సింగ్ తండా-బీసీ తండా వయా సూర్యాతండా బ్రిడ్జి కోసం రూ. 4.45 కోట్లు కేటాయించారు. ఆ వెంటనే ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు వీటి నిర్మాణాలపై దృష్టి సారించడం లేదు.
గత వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకన్న మత్తడిలో కొట్టుకుపోయాడని, అలాగే వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నర్సయ్య వెంకటాపురం-హరిపిరాల మధ్య బర్ల చెరువు మత్తడిలో పడి మృతి చెందాడని ఇక్కడి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. అలాగే మడిపల్లి-కంఠాయపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోగా పలుచోట్ల రోడ్లు ధ్వంసమైనట్లు ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే పనులు మొదలుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేనే ఈ పనులు నిలిపివేయాలని స్వయంగా అధికారులను ఆదేశించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తొర్రూరు మండలానికి ఆరు హైలెవల్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. గత రెండేళ్లలో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. నెల క్రితం మూడోసారి టెండర్ పిలువగా అగ్రిమెంట్ కూడా పూర్తయ్యింది. నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.
– జీ శ్రీనివాస్‌రావు, పీఆర్ డీఈ, తొర్రూరు
హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత బీఆర్ ఎస్ సర్కారు హయాంలో నిధులు మంజూరైనా పనులు మాత్రం మొదలు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఈ పనులు చేపట్టకుండా అడ్డుకుంటూ రైతులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఎన్నికల ముందు రైతులకు అండగా ఉంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నది. భారీ వర్షాలకు వరదలు వచ్చి లోలెవల్ కాజ్‌వేల వద్ద ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ మళ్లీ వానకాలం వచ్చినా బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించలేదు.
-మంగళపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ, తొర్రూరు