కృష్ణకాలనీ, జనవరి 18 : రాజకీయ కక్షతోనే ఆలయ స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులకు ఎండోమెంట్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి రాగా ట్రస్ట్ సభ్యులు, భక్తులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి గండ్ర అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ సునీత మాట్లాడుతూ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం రిజిస్టర్ అయినా, కాకున్నా పోరంబోకు భూమిలో నిర్మించిన ఆలయం తమ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు.
ఆలయానికి భక్తులతో పాటు ఆదాయం కూడా వస్తుండడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్వాధీనం చేసుకోవడానికి వచ్చామన్నారు. ఈ క్రమంలో వారి చర్యలను అడ్డుకోవడంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు. ఈ విషయమై గండ్ర మాట్లాడుతూ పది రోజుల క్రితం తమకు ఎండోమెంట్ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటారని తెలియడంతో కమిటీ సభ్యులందరం కలిసి పనులు ఇంకా ఉన్నాయని, పూర్తయిన వెంటనే తామే అప్పగిస్తామని రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశామన్నారు. ఏదైనా ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటపుడు నోటీసు ఇస్తుందన్నారు. కానీ ప్రభుత్వం ఒక రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు 15 మంది ఉద్యోగులకు ఆదేశాలిచ్చారని, ఇదంతా కక్ష సాధింపుతోనే జరుగుతున్నదన్నారు. ఈ ఆలయం తన ఒక్కడి ఆస్తి కాదని, దేవుడిని పూజించే ప్రతి ఒకరిదని, అధికారులు సహకరించాలని కోరారు. ఆల యం కోసం వచ్చిన విరాళాలను ఇష్టానుసారంగా వాడుతున్నానని స్థానిక ఎమ్మెల్యే ఆరోపించారని, తాను ఒక్క పైసా ముట్టుకోలేదని, దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తికే మొత్తం అప్పగించానన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడన్నారు. గండ్ర వెంట మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు కొత్త హరిబాబు, ఎడ్ల మౌనిక, బద్ది సమ్మయ్య, మంగళపల్లి తిరుపతి, మేకల రజిత, బానోత్ రజిత, ముంజంపల్లి మురళీధర్, దార పూలమ్మ, కో ఆప్షన్ మెంబ ర్ దొంగల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.