హనుమకొండ, ఆగస్టు 6 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, రైతుల పొలాలు ఎండబెట్టేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. 14 ఏండ్లు తెలంగాణ ప్రాంతమంతా తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకొని, 60 ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన మహానీయుడు కేసీఆర్ అన్నారు. జయశంకర్ సార్ చూపిన ఆయన పయణిస్తూ ఉద్యమ వ్యాప్తి చేశారని పేర్కొన్నారు.
బుధవారం హనమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నీళు,్ల నిధులు, నియామకాలే ఎజెండాగా కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారన్నారు. ప్రజల తలసరి ఆదాయాన్ని మూడు రెట్లు పెంచారని, ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని రుజువు చేశారన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం కేసీఆర్ సాగునీటి కృషిని, పథకాలను, ప్రాజెక్టులను కొనియాడారన్నారు.
కాళేశ్వరంతో సహా పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నాటి కేంద్ర ప్రభుత్వం కొనియాడారన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారన్నా రు. పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెడుతున్నదని, కేసీఆర్‌ను బద్నాం చేసే కుయుక్తులు పన్నుతున్నదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏకమై బీఆర్ఎస్పై చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని దాస్యం హెచ్చరించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ చెన్నం మధు, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, హరి రమాదేవి, నయీముద్దీన్, జానకిరాములు, వినీల్‌రావు, కేపీ రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, మహేందర్, అనిల్, శ్రీధర్‌రావు, రాకేశ్‌యాదవ్, మనోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతుల మేలు కోసమే కాళేశ్వరం
తెలంగాణ ప్రజల కోసమే జీవించే నేత కేసీఆర్ రైతుల మేలుకోరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఆంధ్ర కోవర్ట్ అయిన రేవంత్‌రెడ్డి వారికి నీళ్లు ఇచ్చేందుకు బనకచర్లకు ఓకే చెప్పాడు. తలాతోక తెలవని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు మేలు చేయడు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లకు పెరిగింది. నన్నపునేని ఫౌండేషన్ ద్వారా 119 నియోజకవర్గాల్లోని మేధావులను ఏకం చేస్తాం. కాళేశ్వరంపై సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ చేర్చే ప్రయత్నం చేస్తాం. నన్నపునేని నరసింహమూర్తి పేరు మీద కాళోజీ, జయశంకర్ సార్ సాక్షిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తాం. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు బలం, బలగం.
-నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే, వరంగల్ తూర్పు
ఘోష్ నివేదికకు రాజ్యాంగబద్ధత లేదు
కుట్రపూరితంగానే కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నది. రా జ్యాంగంపై ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి అబద్ధాలాడుతున్నారు. ఘోష్ కమిషన్ ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమే. కొన్ని సంస్థలు, మీడియా చానల్స్ పనిగట్టుకొని కాళేశ్వరం కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నాయి. 650 పేజీల రిపోర్ట్‌ను కమిషన్ ఇస్తే కాంగ్రెస్ కేవలం 60 పేజీలను మాత్రమే ప్రజల ముందుంచడం ఏమిటి? సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే 650 పేజీల రిపోర్టును బయటపెట్టాలి.
ఘోష్ నివేదిక బయటకు రాకముందే కాంగ్రెస్ మీడియాకు లీకులిచ్చింది. కాళేశ్వరంలోని రెండు, మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వ పెద్దదే బాధ్యత అవుతుందా? సివిల్ సప్లయ్ శాఖలో కాం గ్రెస్ పాలనలో రూ. 1100 కోట్ల కుంభకోణం జరిగింది. అది సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమకుమార్రెడ్డే చేశారా? ధాన్యం టెండర్ల దొంగ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. త్వరలో ప్రజలు, సంఘాలు, మీడియాకు విషయాలు తెలిపేందుకు చలో కాళేశ్వరం చేపడతాం. కేసీఆర్‌పై కక్షతో కమిషన్ వేశారు తప్ప నీటి వనరులపై సమీక్ష చేశారా? అమలు కానీ హామీలు, చిల్లర పనులతో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడు తప్ప ప్రజలకు మంచి చేసి కాదు. కేసీఆర్, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష.
-పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట