నయీంనగర్, సెప్టెంబర్ 30 : పశ్చిమ ఎమ్మెల్యే నాయిని సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, శ్రేణులతో కలిసి నయీంనగర్ నాలా పరిశీలనకు రాగా కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కార్యకర్తలతో బైక్ ర్యాలీగా వచ్చిన దాస్యం శాంతియుతంగా నయీంనగర్ నగర్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా జై నాయిని, రాజేందర్‌రెడ్డికి అడ్డెవడంటూ నినాదాలతో బీఆర్ఎస్ శ్రేణుల వైపు దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు, పార్టీ కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్త తస్లీమాకు గాయాలయ్యాయి. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యాన్ని నిరసిస్తూ దాస్యం అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పెట్రోల్ పంపు, అంబేద్కర్ సర్కిల్, అదాలత్ సెంటర్, సుబేదారి, అక్కడి నుంచి హనుమకొండ చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాల్లో తిప్పి బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం హనుమకొండ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. ఆ తదుపరి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
దాస్యం వెంట కార్పొరేటర్లు సోదా కిరణ్, ఇమ్మడి లోహితరాజు, సంకు నర్సింగ్, చెన్నం మధు, బొంగు అశోక్, రంజిత్‌రావు, కూడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు పబ్బోజు శ్రీకాంతాచారి, బండి రజిని, పులి రజినీకాంత్, రాకేశ్, ప్రశాంత్, వీరు, కల్యాణ్ తదితరులున్నారు. కాగా, నాలా వద్దకు చేరుకున్న మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ 2022లో ఈ పనులకు సంబంధించి టెండర్ పూర్తయ్యింది వాస్తవమేనన్నారు. పనులు ఆలస్యం కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్ని శాఖలను కలుపుకొని పనులు పూర్తి చేయించారన్నారు.
హనుమకొండ, సెప్టెంబర్ 30 : హనుమకొండలోని నయీంనగర్ బ్రిడ్జిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వెళ్లిన శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హనుమకొండలో స్వయంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డినే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి దిగజారి గాజులు, చీరలతో రోడ్లమీద నిలబడి సవాళ్లు చేయడం శోచనీయమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశాంతి, విధ్వంసం, అరాచకం సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నదన్నారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2 నెలలు ఎన్నికల కోడ్‌కే పోయిందని, అప్పుడే ప్రపోజల్, టెండర్లు, నిధుల మంజూరు పనులు పూర్తి అయ్యాయా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో మాత్రమే ఎమ్మెల్యే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడని, ఒకసారి నిధులు మంజూరయ్యాక ఆ స్థానంలో ఎవరున్నా పని అవుతుందన్నారు. ఒక బ్రిడ్జి పూర్తయితేనే రోడ్డెక్కి ఇంత హంగామా చేస్తే రేపు ఇంకేదైనా ఘనకార్యం చేస్తే ప్రజలు, ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి దూరి దాడులు చేసేలా ఉన్నారని రాకేశ్‌రెడ్డి ఆరోపించారు.