లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు. మంగళవారం ఉదయం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని గోదాముల్లో, మహబూబాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలోని సెంటర్లో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేసి గెలుపొందిన వారికి ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఆయాచోట్ల కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ప్రావీణ్య, అద్వైత్ కుమార్‌సింగ్ పర్యవేక్షించగా, బందోబస్తుపై పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచనలు చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజార్టీతో ఎన్నికయ్యారు. మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా బలరాంనాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై 3,49,028 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే పెద్దపల్లి, భువనగిరి లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై 1,31,364 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై 2,25,209 మెజార్టీతో రెండోసారి గెలిచారు.
కాశీబుగ్గ: వరంగల్ ఎంపీగా గెలుపొందిన డాక్టర్ కడియం కావ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికల ఫలితాల కోసం కాశీబుగ్గ నుంచి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చి వేచి ఉన్నారు. తుది ఫలితం వెల్లడయ్యాక ఎన్నికల అధికారి ప్రావీణ్య ధ్రువీకరణ పత్రం అందించారు. భూపాలపల్లి, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు భవేశ్‌మిశ్రా, సిక్తాపట్నాయక్, షేక్ రిజ్వాన్‌బాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, సంధ్యారాణి, డీసీపీ రవీందర్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, తిరుపతి, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు పలువురు ఓట్ల లెక్కింపును పరిశీలించారు. బందోబస్తుపై సీపీ పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు.
వరంగల్ ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు అభినందనలు. దేశంలో ఇండియా కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఆయనను జైలుకు పంపిన రోజే జగన్ ఓటమి ఖాయమని తేలిపోయింది. కక్ష సాధింపు చర్యలతోనే జగన్ ఓటమిపాలయ్యాడు.
ప్రజాసేవకు అంకితమవ్వాలి. అధికారం రాగానే అహంకారంతో ప్రతిపక్షాలను చూపు చూసి, కేసులతో వేధిస్తే ప్రజల చీత్కారానికి గురవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫలితం వచ్చింది. ప్రతిపక్ష నాయకులను వేధించినందుకు, ప్రజలను లెక్క చేయనందుకే జగన్ ఓటమి పాలయ్యారు. చంద్రబాబు గెలిచారు.
వరంగల్ ప్రజలు కాంగ్రెస్‌కు వన్‌సైడ్‌గా ఓటే వేశారు. ఇది కాంగ్రెస్ సమష్టి విజయం. వరంగల్ సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తా. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కృషి చేస్తా. యువత ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తా. డాక్టర్‌గా నిత్యం పేద ప్రజల మధ్య ఉంటా. పేదల సమస్యల పరిషారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తా. పట్టణ ప్రాంతంలో బీజేపీ కొంత ప్రభావం చూపినా ఫలితాల్లో అది నామమాత్రంగానే ఉన్నది.
మహబూబాబాద్ రూరల్: పేదలకు సేవ చేసే సువర్ణ అవకాశాన్ని మానుకోట పార్లమెంట్ ప్రజలు ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం. మానుకోట పరిధిలోని అనేక ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేలా ప్రత్యేక దృష్టి పెడతా. ప్రధానంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, భద్రాచలం ఆలయ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్, పలు కళాశాలలు తెచ్చినం. మళ్లీ వాటిని అప్‌గ్రేడ్ చేయిస్తా. అనేక ప్రాంతాల్లో హైలెవల్ వంతెనలు లేక పేద ప్రజలకు ఇబ్బంది అవుతోంది. వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తా. మానుకోట పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా గిరిజన ప్రాంతం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా ప్రజల వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తా. మహబూబాబాద్, కేసముద్రం, పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ చేసేలా చూస్తా. ఇంత మెజార్టీ గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా గెలుపునకు సహకరించిన పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటా.