జనగామ, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ‘జనగామలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేద్దామా.. నువ్వు సిద్ధపడితే చెప్పు.. ఎదుర్కొనేందుకు మేము రెడీ.. సస్పెండ్ బూచీ చూపించి కేసులతో భయపెట్టాలని చూడొద్దు.. కాంగ్రెస్ పార్టీలో బీసీలపై కక్షపూరిత రాజకీయాలు మానుకో.. నీవద్ద మేం డబ్బులు తీసుకున్నట్లు కొమురవెల్లి మల్లన్న సాక్షిగా తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమైతే మేం వస్తాం’ అంటూ డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ అయ్యారు.
శనివారం జిల్లా కేంద్రంలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేమళ్ల సత్యనారాయణరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములు, మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, సర్వల నర్సింగరావు, దూడల సిద్ధయ్య తదితరులు మాట్లాడారు. కొమ్మూరి జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచే వర్గపోరు పెరిగిందన్నారు.
ప్రశాంతంగా ఉన్న జనగామలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న కొమ్మూరిని తరిమికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకులను రాజకీయంగా ఎదగకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొమ్మూరి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని, కొందరు చెప్పిన మాటలతో సీనియర్లను దూరం పెట్ట డం వల్లే పార్టీలో అనిశ్చితి నెలకొన్నదన్నారు. 40ఏండ్లుగా పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న సీనియర్లను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని వారు ధ్వజమెత్తా రు.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నుంచి రూ.3 కోట్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే కొమ్మూరి రాజకీయ సన్యాసం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వై సుధాకర్ సవాల్ విసిరారు. సమావేశంలో గంగరబోయిన మల్లేశ్, రామగల్ల విజయ్, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, గుండా శ్రీధర్‌రెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, దాసరి శేఖర్, జాయ మల్లేశ్, లింగాల రాజేందర్‌రెడ్డి, గుజ్జల మధు, సరాబు మధు, తోట సత్యం, చిర్ర హన్మంతరెడ్డి, గనిపాక మహేందర్, సలేంద్ర శ్రీనివాస్, కాముని శ్రీనివాస్, పర్శరాములు, బాల్నె సురేశ్, వంచ వెంకట్‌రెడ్డి, వేముల మల్లేశ్, కనకరాజు, శివ, సత్యనారాయణ, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.