పాలకుర్తి, మే 31: జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం పేర రాజకీయం చేయడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి గొడవకు తెరలేపారు. గతంలో బీఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ తల్లి గద్దెను అనుమతిలేకుండా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ప్రోద్బలంతో ఆక్రమించుకుని పునర్నిర్మాణానికి పూనుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డు కున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అంబేద్కర్ జయంతి రోజు దేవరుప్పులలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించొద్దని కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో అడ్డుకుని రాజకీయం చేశారు. అంతకు ముందు కామారెడ్డిగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చడానికి అధికారులు, కాంగ్రెస్ నాయకు లు కుట్ర చేశారు. పాలకుర్తిలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాన్ని కూల్చి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు పూనుకున్నారు. వీటిని మరువక ముందే ఎమ్మెల్యే అండదండలతో శనివారం కాంగ్రెస్ శ్రేణులు పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహ గద్దెను ఆక్రమించుకుని పునర్నిర్మాణానికి పూనుకున్నారు.
దీనికి నిరసనగా పార్టీ శ్రేణులు గంట పాటు ధర్నా చేపట్టారు. గద్దె నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలో వర్థన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సై దూలం పవన్‌కుమార్‌తో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి వాగ్వావాదానికి దిగారు. బీఆర్ఎస్ నిర్మించిన గద్దెను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకొని ఎమ్మెల్యే అండతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎమ్మెల్యే కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
పాలకుర్తిలో పోలీసు పాలన నడుస్తున్నదని, అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నుల్లో పని చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు కుర్చీలు వేసుకుని అనుమతి లేని తెలంగాణ తల్లి గద్దె ని ర్మాణం చేస్తుంటే పోలీసులు కాపలా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెట్టిస్తున్నదని నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కో ఆర్డినేటర్ జోగు గోపీని పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే ఎమ్మెల్యే, పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందించి గద్దె నిర్మాణాన్ని ఆపాలని, లేకుంటే రేపు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.