ఖిలావరంగల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నాయకులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ బిజెపి అధ్యక్షుడు ఎండి రఫీ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని గురువారం పుప్పాలగుట్టలో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు ఉద్యోగులకు కూడా మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ శ్రేయస్కరంగా ఉందన్నారు.
రూ. 12 లక్షల వార్షిక ఆదాయంపై పన్నును రద్దు చేస్తూ ప్రకటించడం హర్షదాయకమన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. పరిపాలన చేతకాకని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుందర్, జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్, నాయకులు తమ్మిశెట్టి క్రాంతి, వైట్ల గణేష్, శక్తి కేంద్ర ఇంచార్జ్ కందుకూరి విజయ్, సుంచు కేశవ్ తదితరులు పాల్గొన్నారు.