కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్నికల టెన్షన్ పట్టుకున్నది. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నది. అయితే అంతంత మాత్రంగానే అమలవుతున్న సంక్షేమ పథకాల, చెప్పుకోలేనంత అభివృద్ధి లేకపోవడం, అంతకుమించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎటుదారి తీస్తుందేమోననే భయం వారిలో కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాన్నర గడుస్తున్నా తమ నియోజకవర్గాల్లో గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి తప్ప.. తాము చేసిన, చెప్పుకోదగ్గ పనులేవీ లేకపోవడంతో ప్రజాతీర్పు ప్రతికూల ఫలితాలనిస్తుందేమోనని తలల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
– వరంగల్, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో కలిపి 1,702 గ్రామ పంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జూలైలో ఎన్నికల ప్రక్రి య మొదలుపెట్టి, ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలనగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఆందోళన పెరుగున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు.
గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియడంతో అప్పటివరకు పక్కాగా ఉన్న పారిశుధ్య నిర్వహణ సైతం అధ్వాన్నంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్వహణ ఎక్కువ గ్రామాల్లో సరిగా లేదు. ట్రాక్టర్లను మూలన పడేశారు. అధికార యంత్రాంగం ప్రణాళిక లేకపోవడంతో ఉపాధి హామీ పనులు సరిగా సాగడం లేదు. గత ప్రభుత్వంతో పోల్చితే గ్రామాల్లో అభివృద్ధి పనుల పరంగా ప్రతికూలతలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు అనగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.
కానరాని సంక్షేమం
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు జరగడం లేదు. పేదల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఒక్క పథకాన్ని మొదలు పెట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాల నిర్వహణలోనూ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీ అయోమయంగా ఉంటున్నది. రేషన్ కార్డు జారీ అయ్యిందని చెబుతున్న అధికారులు నెలవారీగా ఇచ్చే బియ్యం కోటా రాలేదని చెబుతున్నారు. ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియపై అనేక సందేహాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్తగా సామాజిక పింఛను మంజూరు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వయోపరిమితి లేని లక్షల మందికి ఇప్పుడు 65ఏండ్లు నిండాయి. వివిధ కారణాలతో చాలామంది చనిపోయారు. మృతిచెందిన వారి భార్యకు ఇవ్వాల్సిన వితంతు పింఛన్ల మంజూరును ఇంకా మొదలుపెట్టలేదు.
అర్హుల్లో కొత్త వారికి సామా జిక పింఛన్లు ఇవ్వకపోగా అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పిన హామీ అమలు కావడం లేదు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ హామీని మరచిపోయింది. యువత ఉపాధి కోసం రాజీవ్ యువవికాసం పేరుతో పథకాన్ని పెట్టింది. అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించినా మంజూరు పత్రాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. రూ.500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంటున్నది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులను కాకుండా అధికార పార్టీ వారికి, పలుకుబడి ఉన్న వారికీ మంజూరు చేశారని గ్రామాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సంక్షేమం అమలు, అభివృద్ధి పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అదే తీరు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే తమకు ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.