జయశంకర్ భూపాలపల్లి మే 8 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అధికార కాంగ్రెస్ నేతల రాజకీయం దుమారం లేపింది. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ప్రజల సహకారంతో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఉన్నట్టుండి దేవాదాయ శాఖ అధికారు లు ఆలయానికి ట్రస్టు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ముహూర్తం పెట్టడం వివాదానికి దారితీసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అరెస్టు చేసేందుకు వాహనాలను సిద్ధం చేశారు.
మధ్యాహ్నం వరకు ఆలయంలో గండ్ర దంపతు లు, బీఆర్ఎస్ శ్రేణులు పూజలు చేయగా, ప్రమాణ స్వీకారానికి వచ్చిన సభ్యులు, కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆలయంపై కోర్టులో స్టే ఉండగా ట్రస్టు ఎలా ఏర్పాటు చేస్తారని, అధికార పార్టీ నేతల తీరుపై మండిపడిన వెంకటరమణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోగా, జ్యోతి మహిళా కార్యకర్తలతో అక్కడే ఉన్నారు. ఎవరూ లేని సమయం చూసిన పోలీసులు జ్యోతితో పాటు మహిళా కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. గుడిపై రాజకీయం చేయెద్దంటూ జ్యోతి విలపించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో జ్యోతి స్పృహతప్పి కింద పడిపోగా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంకటరమణారెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆగ్రహించిన పార్టీ శ్రేణులు భూపాపలల్లి ప్రధాన రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు.
ఉద్రిక్తతలు, పోలీస్ పహారా నడుమ దేవాదాయ శాఖ అధికారులు నలుగురితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏప్రిల్ 10న ట్రస్టు బోర్డు సభ్యుల ఆర్డర్ కాపీ రాగా ఇన్ని రోజులుగా అధికారులు దానిని బయటికి రానివ్వకుండా గోప్యంగా ఉంచారు. కాగా, శుక్రవారం హడావుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నించడంతో, పనులు పూర్తి చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆలయాన్ని అప్పగిస్తామని ధర్మకర్తలైన గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి స్టే తీసుకొచ్చారు. ఈ క్రమంలో ట్రస్టు ఏర్పాటు చేయడం, ప్రమాణ స్వీకారం చేయడం ఈ వివాదానికి దారి తీసింది.
అయినా పోలీస్ ఫోర్స్‌తో తతంగాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తన సతీమణి గండ్ర జ్యోతి ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లడంతో స్పృహ తప్పి పడిపోయిందన్నారు. ‘చట్టం మీ చుట్టం కాదు.. అధికారం శాశ్వతం కాదు.. చరిత్ర చూసుకోండి’ అని మండిపడ్డారు. ఆలయాన్ని కొందరు దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో తనపై కేసులు కూడా వేశారని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొన్నానని తెలిపారు. బలవంతంగా దేవాదాయశాఖలోకి తీసుకోగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చానని, నిర్మాణ పనులు పూర్తయ్యేదాక తమ ఆధీనంలో ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, అయినా ఏక పక్షంగా ట్రస్టు ఏర్పాటు చేసి కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేసినా శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.