వరంగల్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గ్రూపుల పంచాయతీ ఆ పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్‌రావుల వ్యవహారశైలి మారడం లేదని, ఇకపై సహించేది లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయి ని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరా జు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పార్టీలో గ్రూపులను తయారు చేయడం, సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు నమో దు చేసేలా పోలీసులపై ఒత్తిడి తేవడంపై గత అక్టోబర్‌లో అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారి మాత్రం ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా కొండా మురళీధర్‌రావు ఇటీవల పోచమ్మమైదాన్ జంక్షన్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై చేసిన విమర్శలతో పార్టీకి నష్టం జరిగిందని వివరించారు.
ఈ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ మరుసటి రోజు మంత్రి కొండా సురేఖ ఇదే తరహాలో మాట్లాడారని పేర్కొన్నా రు. మంత్రి సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్‌రావు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేయడం లేదని, అత్యధిక ఎమ్మెల్యేలతో వారికి విభేదాలున్నాయని చెప్పుకొచ్చారు. మంత్రి సురేఖ బాధ్యతలు నిర్వహించే దేవాదాయ శాఖ విషయంలోనూ ఇటీవల వివాదాస్పద నిర్ణయాలను ప్రకటించారని, భద్రకాళీ ఆలయంలో బోనాల నిర్వహణ నిర్ణయంపై వరంగల్ నగరంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వివరించినట్లు తెలిసింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తనపై కొండా దంపతులు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరకాల నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తమకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కొండా సురేఖ దంపతులతో ఎలాంటి సంబంధం లేని భూపాలపల్లి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌లో గ్రూపులను తయారు చేస్తున్నారని అక్కడి సెగ్మెంట్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.
కొండా సురేఖ మొదటినుంచీ వివాదాస్పదంగా ఉంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీనాక్షీ నటరాజన్‌కు తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో జరిగిన వ్యవహారాలను వివరించారు. గత అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల మధ్య గొడవలు జరిగేలా చేశారని, మంత్రిగా ఉన్న కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హంగామా చేశారని గుర్తుచేశారు. ఈ అంశం పరకాల నియోజకవర్గంలో పార్టీకి బాగా నష్టం చేసిందని వివరించారు.
అప్పుడు పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలను వివరించామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని నొక్కి చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్పందించినట్లు తెలిసింది. కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర్‌రావు వ్యవహార శైలిపై పార్టీపరంగా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇస్తామన్నట్లు తెలిసింది.