హనుమకొండ, మే 7: బోనస్ ఎగవేసేందుకే ధాన్యం కొనుగోలు ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తున్నదని, పండించిన ప్రతి పంటకూ కమీషన్ తీసుకుంటూ దాన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుందని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రూ. 1100 కోట్లు.. నిన్న సీసీఐ పత్తి కొనుగోళ్లలో రూ. 3000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. నిధులు, ఆర్థిక స్థితి బాగాలేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలు, అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టాల్లో కూరుకుపోయినా పట్టించుకోవడం లేదన్నారు. టార్పాలిన్ల్లు, మాయిశ్చర్ మిషన్ల కోసం రైతులు కొట్టుకుంటున్నారని అన్నారు.
సివిల్ సప్లయి ధాన్యం కొనుగోలులో అవినీతి, అక్రమాల విషయంలో హైకోర్టు నోటీసులు జారీ చేసి 14 నెలలు గడుస్తున్నా 14 సార్లు వాయిదాలు కోరిన ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదంటే కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు. ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గాల్లో వచ్చి గాలి మాటలు మాట్లాడారని అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరు గుతుందని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాయిశ్చర్, వేయింగ్, గ్రేడింగ్ మిషన్, టార్పాలిన్ల వంటి వాటికి టెండర్లు ఇప్పుడు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు.
ఇందులో నిబంధనలకు విరుద్ధంగా పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు 25 శాతం ఎక్సెస్‌తో సమయం దాటిన తర్వాత సీజ్ చేసిన టెండర్ బాక్స్‌ను తెరిచి దాఖలు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెపుతున్నారని పెద్ది ధ్వజమెత్తారు. ఇందులో పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కొనుగోళ్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని, ఇది గత చరిత్రలో ఎప్పుడూ జరుగలేదన్నారు.
అలాగే హైదరాబాద్, వరంగల్ సీసీఐ పత్తి కొనుగోలు విషయంలో రూ. 3వేల కోట్ల కుంభకోణం జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఇన్వాల్మెంట్ లేనపుడు వారు ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కుంభకోణాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా మొదట హైదరాబాద్‌లోని రీజినల్ మేనేజర్, ఆతర్వాత జనరల్ మేనేజర్ కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నయీముద్దీన్, బండి రజినీకుమార్ పాల్గొన్నారు.