హనుమకొండ, ఆగస్టు 13 : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పింఛన్లపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. గతంలో జూన్ 2న, ఇప్పుడు పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు ఇస్తామని ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కొర్రీలతో జారీచేసిన తాజా నిబంధనలు లబ్ధిదారులకు గట్టి షాక్‌ను ఇచ్చాయి. పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వడంతో ఇప్పట్లో పెన్షన్లు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఎన్నికల ముందు అర్హులైన ప్రతి ఒకరికీ పింఛన్ (చేయూత) అందిస్తామని, పెన్షన్‌ను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వితంతువు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తుల నుంచి సర్కారు స్వీకరిస్తున్న దరఖాస్తు ఫామ్‌లో వృద్ధులు, బీడీ కార్మికుల కాలం లేకపోవడంతో వారికి అవకాశం లేకుండా పోయింది. కాగా అర్హులైన వారు ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దరఖాస్తులు అందజేసిన విషయం తెలిసిందే.
కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం పలు కఠిన నిబంధనలు విధించడం పేదల ఆందోళనకు కారణమవుతున్నది. అర్హత ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు, ఇంట్లోని ఇతర సభ్యుల ఉద్యోగాలు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకుంటుండటంతో అనేక మంది దరఖాస్తుదారులు అనర్హులుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబానికి 3 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల వార్షిక ఆదాయం మించినా, అలాగే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వృత్తి నిపులున్నా చేయూత పింఛన్లకు అనర్హులని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.
అలాగే సదరం సర్టిఫికెట్లు పొందిన చాలా మంది దివ్యాంగులకు ఇప్పటి వరకు యూడీఐటీ కార్డులు జారీకాలేదు. అయితే దరఖాస్తులో తప్పనిసరిగా సదరు నంబర్ నమోదు చేయాలని సర్కారు పేర్కొందని, సదరం సర్టిఫికెట్ ఆధారంగా తమకు అవకాశం కల్పించాలని దివ్యాంగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఒంటరి మహిళలకు తహసీల్దార్ ధ్రువీకరణ అవసరమని పంచాయతీ కార్యదర్శులు అడుగుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో వారు గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే పింఛన్ల భారం తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హనుమకొండ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు మొత్తం 11,109 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు 3,052, బీడీ కార్మికులు 513 మంది, మొత్తం 3,565 (ఈ సంఖ్య ఇంకా ఎక్కువనే ఉంటుందని అధికార వర్గాల సమాచారం) మందికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పింఛన్ ఇచ్చేదని, కాంగ్రెస్ సర్కారు కొందరికే పరిమితం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు కలిసి 1,00,504 మంది పింఛన్‌దారులున్నారు.