నర్సింహులపేట, జూలై 4 : ‘నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తాం… అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తాం.. సొంతస్థలం ఉన్న ప్రతి పేదకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తాం.. సొంత జాగ లేని పేదలకు స్థలంతోపాటు రూ.5లక్షలతో ఇల్లు కట్టిస్తాం’ అని ఎన్నికల ముందు నోటికొచ్చిన హామీలిచ్చిన కాంగ్రెస్ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన నేతలు.. అధికారంలోకి వచ్చాక సవాలక్ష కొర్రీలు పెట్టి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నాయకుల మాటలు నమ్మి ఇండ్లు కట్టుకున్న పేదలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇల్లు కట్టుకునేందుకు తెచ్చిన అప్పులకు మిత్తిలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఒకవైపు ముంచుకొస్తున్న వానలు, మరోవైపు పెరుగుతున్న మిత్తి.. ఇన్ని ఇబ్బందుల నడుమ ఇంటి నిర్మాణం పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారుల ఆవేదన అరణ్య రోదనగా మారుతున్నది. అధికారులు వచ్చి నాలుగైదు సార్లు ఫొటోలు తీసుకుపోతున్నరు కానీ, ఇప్పటి వరకు రూపాయి కూడా పడలేదని, అసలు ఈ పథకం తమను ఆదుకోవడానికి తెచ్చారా? లేక అప్పుల ఊబిలోకి నెట్టడానికి తెచ్చారా? అంటూ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాకు 10,231 ఇండ్లు మంజూరు కాగా, 8,937ఇండ్లకు ముగ్గులు పోశారు. జూన్ నెల వరకు 2905 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికీ ఇంకా 1,294 ఇండ్లకు ముగ్గులే పోయలేదు. వివిధ దశల్లో ఇండ్లకు బిల్లులు రాకపోవడంతో పేదలు గొల్లుమంటున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించి లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. మొదటి విడుత బేస్మెంట్ (పునాది) స్థాయిపూర్తి కాగానే, రెండో విడుత రూఫ్‌లెవల్ (గోడలు),మూడో విడుత స్లాబ్, నాల్గో విడుత ప్లాస్టరింగ్, రంగులు, తలుపులు వంటి ఫినిషింగ్ పనులు పూర్తి కాగానే నిధులు విడుతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎకడా అమలు కావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేసుకొని ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ పట్టణాల్లో రూ.2లక్షల వరకు, గ్రామాల్లో రూ.3.40లక్షలు మాత్రమే బిల్లులు వచ్చాయని, అధికారులు వచ్చి పరిశీలించి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి, జియో ట్యాగింగ్ పూర్తి చేసినా నిధులు రావడంలేదని వాపోతున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు జాబ్‌కార్డు ఉంటే ఉపాధి పథకంలో భాగంగా 90 రోజుల పనులు చేసుకునేందకు పంచాయతీ రాజ్ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో కొంతమంది ఉపాధి సిబ్బంది, అధికారులు కొన్ని గ్రామాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 90 రోజుల ఉపాధి వేతనం రావాలంటే రూ. 3వేలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
స్థాయికి మించి అప్పులు..
ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపికైన వారిలో అత్యధికులు రోజువారీ కూలీలు, చేతివృత్తుల వారు, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో సొంత గూడు ఏర్పడుతుందని ఆశపడ్డారు. అధికారులు సైతం మీరు పని ప్రారంభించండి.. బిల్లులు పడిపోతాయి.. అని చెప్పడంతో స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద మిత్తికి అప్పులు తెచ్చి ఇండ్లు కట్టుకున్నారు. అయితే విడుతల వారీగా బిల్లులు రాక కొందరు మధ్యలో పనులు ఆపేస్తే ఇండ్లు పాడవుతుందనే భయంతో మరింత అప్పు చేసి గోడలు లేపారు.. స్లాబులు పూర్తి చేశారు. కొందరైతే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్మి, అప్పులు చేసి ఏకంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు కూడా చేసుకున్నారు. తీరా బిల్లులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మానసిక వేదనకు గురవుతున్నారు. బిల్లుల కోసం లబ్ధిదారులు రోజువారీ కూలీ పనులు వదిలేసి, కాళ్లరిగేలా మండల పరిషత్ కార్యాలయాలు, హౌసింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మేము ఆన్లైన్లో అప్లోడ్ చేశాం, పై నుంచి బడ్జెట్ విడుదల కాలేదు. బడ్జెట్ రాగానే మీ అకౌంట్లలో పడతాయి’ అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు అందించాలని కోరుతున్నారు.