వరంగల్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంక్షేమ పథకాలే కాదు.. అభివృద్ధి పనులకు పేర్లు మార్చి అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాల వ్యవస్థకు కొత్తగా ఈ పేరు పెట్టింది. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో స్కూళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, ములుగు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు చోటు దక్కింది.
వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లకు మొండి చేయి చూపింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించినప్పటికీ వీటికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేయలేదు. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వకపోవడం వల్లే స్కూళ్లు మంజూరు కాలేదని తెలుస్తున్నది. మొదట ఉమ్మడి వరంగల్ జిల్లాకు నాలుగే స్కూళ్లు మంజూరు కాగా, ఆ తర్వాత మరో రెండు అదనంగా ఇచ్చింది. ఈ జాబితాలోనూ ఈ ఐదు నియోజకవర్గాలకు స్కూళ్లు దక్కలేదు. సదరు ఎమ్మెల్యేలు స్కూళ్ల కోసం కనీసం ప్రతిపాదనలను పంపించలేదని తెలిసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ తర్వాత హనుమకొండ విద్యా కేంద్రంగా ఉన్నది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, నర్సింగ్ కాలేజీ, గురుకులాలతో మరింత అభివృద్ధి చెందింది. విద్యా పరంగా రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ తర్వాత కీలక ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేయలేదు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. కొత్త విద్యా సంస్థలు, భవనాల మంజూరులో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తొలి దశలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల విద్యా సంస్థలకు కేంద్రంగా ఉన్న హనుమకొండలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని తొలిదశలో నిర్మించకపోవడం సరైంది కాదని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి హనుమకొండ, మహబూబాబాద్ నియోజకవర్గాలకు స్కూల్స్‌ను మంజూరు చేసి భవనాలను నిర్మించాలని డిమాండు చేస్తున్నారు. గిరిజన పిల్లలు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాలో కొత్త విద్యా సంస్థను తొలిదశలో నిర్మిస్తేనే మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.