రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిందంతా బోగస్ అని తేలిపోయింది. దీంతో సన్నాలు సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే అమ్మితే మద్దతు ధర రూ. 2320తో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. దీంతో రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని బయట అమ్మ కుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. క్వింటాలు ధాన్యానికి 5కిలోల తరుగుపోతున్నా బోనస్ వస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే తీరా మద్దతు ధర రూ. 2320 మాత్ర మే చెల్లిస్తోంది. మద్దతు ధర డబ్బులే ఖాతాలో పడినట్లు మెసేజ్ రావడంతో రైతులు అయోమ యంలో పడ్డారు. అధికారులను అడిగితే సమాధానం దాట వేస్తున్నారని వాపోతున్నారు.
– కమలాపూర్, నవంబర్ 13
కమలాపూర్, నవంబర్ 13: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో 16, సెర్ప్(ఐకేపీ) ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రా లను ప్రారంభించారు. రైస్‌మిల్లర్లు సన్నరకం ధాన్యం 40 కిలోల బస్తాకు 2కిలోల తరుగు తీస్తూ పదిహేను రోజులుగా కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. అమ్మిన రైతులకు రెండు రోజుల నుంచి రూ. 2320 మద్దతు ధరతోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. బోనస్ డబ్బులు లేకుండా చెల్లింపులు చేస్తుండడంతో రైతులు ఆందోళనతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయాధికా రులు, సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అధికారులు సరైన సమాధా నం చెప్పకుండా దాటవేస్తున్నారు.
సివిల్ సప్లయ్ అధికారులు కొందరు రైతులకు రూ. 2320 మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల తర్వాత బోనస్ చెల్లిస్తుందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు రైతులు తెలిపారు. దీంతో రుణమాఫీ, రైతుభరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోయే బోనస్ డబ్బులు కూడా వస్తయో? రావో? అని అయోమయంతో తెలిసిన అధికారులు, ఇతర మండలాల రైతులకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. ఎక్కడ రైతులకు బోనస్ డబ్బులు పడలేదని చెప్పుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. బోనస్ డబ్బులు వస్తయా? లేదా అనవసరంగా మాటలు నమ్మి అమ్ముకున్నాం. దళారులకు అమ్మిన క్వింటాలుకు రూ. 2700 వచ్చునని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 4018 క్వింటాళ్లు, పీఏసీఎస్‌లో 9542 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు.
ప్రభుత్వం సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తదంటే నమ్మి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మినం. మూడెకరాల్లో వడ్లు 39 క్వింటాళ్ల 20 కిలోలు వచ్చాయి. దొడ్డురకం మద్దతు ధర రూ. 2320తో రూ. 90,944 ఖాతాలో జమ అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఖాతాలో జమ అయిన డబ్బులను లెక్కిస్తే బోనస్ లేకుండా చెల్లించిట్లు తెలిసింది. బోనస్ కలిపి చెల్లిస్తే రూ. లక్షా పదివేలు రావాలి. బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తరని ఐకేపీ అధికారులను అడిగితే సమాధానం చెప్పడంలేదు.
– ఎర్రబెల్లి అనిల్ రావు, రైతు ఉప్పల్, కమలాపూర్