లింగాలఘనపురం, జనవరి 10: ‘నన్ను ఏమనుకుంటున్నారు? నేనెవరో తెలుసా? నేను సర్పంచ్‌ను.. మా పార్టీ అధికారంలో ఉంది.. మీరెంత.. నన్నే చెక్ చేస్తారా? ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాలా? లేదా మంత్రితో చెప్పించాలా’? అంటూ పాలకుర్తి మండలం ఈరవెన్ను మాజీ సర్పంచ్ ముస్కు చంద్రబాబు అతిగా ప్రవర్తించి అబాసుపాలయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేయగా, కోర్టు శుక్రవారం రూ.1500 జరిమానా, మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా లింగాలఘనపురం ఎస్సై బండి శ్రావణ్‌కుమార్ తన బలగాలతో కుందారం క్రాస్ వద్ద గురువారం వాహన తనిఖీలు చేపట్టాడు. ఈ క్రమంలో ఈరవెన్ను గ్రామానికి చెందిన చంద్రబాబు మద్యం తాగి తన కారులో వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. సర్పంచ్ పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తున్నా సదరు వ్యక్తి తాను ఇంకా సర్పంచ్నేనంటూ, సోదా చేయవద్దంటూ, పరీక్షించవద్దని పోలీసులకు సహకరించలేదు. చివరకు పోలీసులు బలవంతంగా బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయాల్సి వచ్చింది. శుక్రవారం జనగామ కోర్టులో ప్రవేశపెట్టడంతో జరిమానా, జైలు శిక్ష విధించింది.