పరకాల, మార్చి 10 : దగాకోరుకు మారుపేరుగా సీఎం రేవంత్ నిలుస్తున్నాడని, ఆయన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని పద్మశాలి భవనంలో పరకాల, నడికూడ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్ అంటేనే దగా అని, అన్ని వర్గాలను మోసం చేయడమే ఆ పార్టీ పని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్‌లో నీటి లభ్యత లేదని, ఎస్సారెస్పీ కెనాళ్ల ద్వారా నీరందించే పరిస్థితులు లేవని ఎమ్మెల్యే రేవూరి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతారన్నారు. బీఆర్ఎస్ను వీడే నాయకులతో పార్టీకి నష్టమేమీ లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది పార్టీని వీడుతున్నారని, పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలు గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి పాలకుల దుశ్చర్యలను ఎదురొడ్డి నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, మేడిపల్లి శోభన్, గురి జపల్లి ప్రకాశ్‌రావు, దగ్గు విజేందర్ రావు, బండి సారంగపాణి, చందు పట్ల రమణారెడ్డి, చందుపట్ల తిరుపతిరెడ్డి, దామెర మొగిలి పాల్గొన్నారు.
దామెర : మండలంలోని ఓగులాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్త్రత స్థాయి సమావేశం సోమవారం జరుగుతుందని వైస్ ఎంపీపీ జాకీర్‌అలీ తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. 14 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, డైరెక్టర్లు, మండల కో ఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు.