వరంగల్, జూన్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది. ఉపాధి కల్పన కోసం సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని పక్కనబెట్టింది. దరఖాస్తుదారును పరిశీలించి అర్హులనే తేల్చి మంజూరు పత్రాలు ఇచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తనదైన పద్ధతిలో యువ వికాసం పథకాన్ని నిలిపివేసింది. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల్లో అర్హులకు జూన్ 2 నుంచి 9లోపు మంజూరు పత్రా లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది.
మంజూరు పత్రాలు అందుకున్న వారికి వారు నెలకొల్పే రంగంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నది. అప్పటివరకు హడావుడి చేసి మంజూరు పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చే సమయానికి కొన్ని గంటల ముందు ఈ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో స్వయంఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది యువతను మోసం చేసేలా వ్యవహరించిందని యువత ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వా త అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమనూ అలాగే చేసిందని యువత మండిపడుతున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం పేరిట ఆర్భాటంగా ప్రకటనలు చేసి, అందరూ దరఖాస్తులు స్వీకరించి, అర్హులను తేల్చిన తర్వాత మంజూరు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మోసపూరిత ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పనలోనూ ఇలాగే చేస్తున్నదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే వ్యవహరిస్తే ఇప్పటికి తమకు సబ్సిడీ రుణాలు వచ్చేవని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోడం వల్ల రాష్ట్రంలోని యువతను మోసం చేసిందని చెబుతున్నారు.
భారీగా దరఖాస్తులు
అర్హులైన యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం సబ్సిడీపై రుణాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించింది. సబ్సిడీ రుణాల ప్రక్రియను నాలుగు గ్రేడ్లుగా విభజించింది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను సబ్సిడీపై అందించేలా పథకాన్ని రూపొంచింది. రూ.50 వేల యూనిట్‌కు పూర్తి సబ్సిడీగా నిర్ణయించింది. రూ.50,001 నుంచి ఒక లక్ష రూపాయల యూనిట్‌కు 90 శాతం సబ్సిడీ.. 1,00,001 నుంచి రూ.2 లక్షల వరకు 80శాతం సబ్సిడీ.. రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70శాతం సబ్సిడీపై రుణాలు ఇచ్చేలా పథకంలో మార్గదర్శకాలను పేర్కొన్నది.
పథకం కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,91,235 దరఖాస్తులు వచ్చాయి. బీసీ కేటగిరిలో అత్యధికంగా 95,479 మంది, ఎస్సీలు 49,276, ఎస్టీలు 33,427, ముస్లిం మైనారిటీలు 10,015, ఈబీసీలు 2,086, క్రిస్టియన్లు 232మంది దరఖాస్తులు చేశారు. తొలి దశలో రూ.50 వేలు, ఒక లక్షల రూపాయల వరకు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పథకాన్ని అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
జూన్ 2 నుంచి జూన్ 9 వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని సూచించింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందే సర్కారు నిర్ణయం మార్చుకున్నది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలతో స్వయంగా ఉపాధి కల్పించుకుందామని ఆశించిన యువత ఒక్కసారిగా నైరాశ్యానికి గురైంది. ప్రభుత్వ మోసపూరిత నిర్ణయంతో స్వయం ఉపాధిపై లక్షల మంది యువత పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.