వేలేరు, మే 3 : వరంగల్ లోక్‌సభ ఎన్నికలు ప్రజల నమ్మకానికి, నయవంచనకు మధ్య పోటీ అని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేలేరు మండలం సోడాషపల్లిలో వేలేరు, ధర్మసాగర్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉండి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని అన్నారు. నాడు ఎమ్మె ల్యే రాజయ్య అభివృద్ధి చేస్తుంటే కడియం శ్రీహరి అడ్డుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉద్యమ నేతకు, ఉద్యమ ద్రోహికి మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దామని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. తండ్రి నకిలీ దళితుడు అయితే కూతురు డబుల్ నకిలీ అని విమర్శించారు.
దళిత దొర, దళిత ద్రోహి అయిన కడియంను బొంద పెట్టడానికి ప్రజలు గడ్డపార, పార పట్టుకుని చూస్తున్నారన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కడియం ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీని కడియం శ్రీహరే ముంచుతారని జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి విరోధి కడియం శ్రీహరి అని, తాను ఎన్నో అభివృద్ధి పనులను మంజూరు చేయిస్తే కడియం అడ్డుకున్నాడని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో సుమారు 1.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తీసుకొచ్చిందని విమర్శించారు. కడియం కావ్యకు డిపాజిట్ కూడా రాకుండా బుద్ధి చెప్పాలని, ఉద్యమనేత సుధీర్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. అరూరి రమేశ్, కడియం కావ్య ఒకే పుట్టలో నుంచి వచ్చారని విమర్శించారు. కడియం శ్రీహరి, అరూరి రమేశ్ ఏమేమో మాట్లాడుతున్నారని, నిజ నిర్ధారణకు ఇద్దరికీ నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రైతులు, ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మరిజె నర్సింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేలేరు జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, ధర్మసాగర్ మండలాధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు సంధ్య, జ్యోతి పాల్గొన్నారు.
వరంగల్, మే 3 : పదవులు పొంది తమ స్వార్థం కోసం పార్టీ వీడిన నయవంచకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం 11, 29 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్‌తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. రామన్నపేట, పాపయ్యపేట చమన్, పోతననగర్, రంగంపేట ప్రాంతాల్లో ప్రజలను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ పంటలకు నీరందిస్తే కాంగ్రెస్ కరువు తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న అనూహ్య స్పందనకు భయపడి ఆయన ప్రచారాన్ని ఆపారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో సదాంత్, ఎండీ షఫీ, గుండు శ్రీనివాస్, శ్రీనివాస్, రాము పాల్గొన్నారు.