హనుమకొండ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై కాంగ్రెస్ క్యాడర్లో ఇన్నాళ్లు ఉన్న అసంతృప్తి బహిర్గతమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన నాగరాజు తమతో సంబంధం లేనట్లుగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు, అర్హులకు సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఇబ్బంది పడాల్సి వస్తున్నదని అన్నారు.
మొదటి నుంచీ ఉన్న వారికి కాకుండా పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ ధోరణి మార్చుకోకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొన్ని రోజుల నుంచే ఈ పరిస్థితి ఉన్నదని, రాజకీయాలకు కొత్త అనే కారణంతో ఇన్నాళ్లు ఓపికగా ఉన్నామని, ఇక సహించేది లేదని ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ కోసం ఐనవోలు మండలస్థాయి సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల నిలదీశారు.
పదేండ్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని కనీసం గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ పార్టీ కోసం పనిచేసే పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్లో డీసీసీబీ చైర్మన్ పదవి, మండల పరిషత్ అధ్యక్ష పదవి అనుభివించిన మార్నేని రవీందర్రావు కుటుంబం ఆ పదవులను నిలుపుకునేందుకు కాంగ్రెస్లోకి వచ్చిందని, వారి పెత్తనంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇక సహించేది లేదన్నారు.
రిటైర్డ్ పోలీసు అధికారి కేఆర్ నాగరాజు అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్లో చేరి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించకపోయినా ఆయన గెలుపు కాంగ్రెస్ క్యాడర్ వల్లే సాధ్యమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘మా ఎమ్మెల్యే దగ్గరకు ఎన్నిసార్లు వెళ్లినా ప్రతిసారి మీరెవరు అని అడుగుతారు. గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసం పార్టీ వాళ్లతో కలిసి వెళ్తే అందరి ముందు మీ పేరేమిటి? ఏ ఊరు? అని ఎమ్మెల్యే అడిగితే సీనియర్ నాయకులుగా మా పరిస్థితి ఎట్లా ఉంటుంది. కొత్తలో అయితే తెలియదనుకోవచ్చు.
రెండేండ్లు దగ్గరపడుతున్నా అలాగే చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తున్నది’ అని ఐనవోలు మండలంలోని ఓ మాజీ ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మొదటి నుంచి పని చేస్తున్న తమను ఇతర నియోజకవర్గాల నేతలు గుర్తుపట్టి పిలుస్తున్నారని, సొంత ఎమ్మెల్యే ఎవరో తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి దరఖాస్తుల కోసం వెళ్లినా ఎమ్మెల్యే, ఆయన ఆఫీసు సిబ్బంది తీరు ఇబ్బందికరంగా ఉంటున్నదని వాపోయారు. రెండేండ్లయినా ఇలాగే ఉంటుండడంతో సమావేశంలోనే మనసులోని మాటను చెప్పామని హసన్పర్తి మండంలోని మాజీ కార్పొరేటర్ వాపోయారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో ఇదే అభిప్రాయం ఉన్నదని వివరించారు.