దేవరుప్పుల, జూన్ 10 : దేవరుప్పుల మండలం రాంభోజీగూడెం, గొల్లపల్లి వాగుల నుంచి ఇసుక తరలించొద్దంటూ రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుక తరలింపును వెంటనే ఆపాలని వందలాది మంది వాగు పరీవాహక రైతులు సోమవారం బీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి పొంట పొలాలు ఎండిపోతున్నాయని మహిళా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం రాంబోజిగూడెం చెక్ డ్యాం నుంచి 5 వేలు, పాలకుర్తి రిజర్వాయర్ కోసం గొల్లపల్లి చెక్ డ్యాం నుంచి మరో 5 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలిస్తే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వాగులో ఎంత ఇసుక ఉంటే అన్ని నీళ్లు నిలుస్తాయని, ఈ విషయం తెలియని సంబంధిత అధికారులు తరలింపునకు సిఫారసు చేయడంపై మహిళా రైతులు వివరించారు. రైతుల వేదనను సావధానంగా విన్న కలెక్టర్ విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాగా, గ్రీవెన్స్ నుంచి రైతులు, బీఆర్ఎస్ నాయకులు నేరుగా రాంభోజీగూడెం వాగు కు వెళ్లారు. అప్పటికే వాగు నుంచి పొక్లెయిన్‌ను ఐబీ శాఖ అధికారులు ఒడ్డుకు తరలించడంతో కలెక్టర్‌కు రైతులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వాగులో మీటరున్నర ఇసుక ఉండడాన్ని మహిళలు స్వయంగా చూపారు. ఈ ఇసుకను తరలించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని, దీని వల్ల మట్టి తేలుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాగును ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేస్తున్న తాము ఇబ్బందులు పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక తరలిస్తే ఉద్యమమే : బీఆర్ఎస్
దేవరుప్పుల మండలంలోని వేలాది మంది రైతులు వాగులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, ఇసుకను తోడితే భూగర్బ జలాలు అడుగంటి అన్నదాతలు ఇబ్బంది పడతారని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వేలాది ట్రక్కుల ఇసుక తరలింపునకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారని, దీనికి పలు విభాగాల అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలే కారణమన్నారు. పలుసార్లు రైతులు గొల్లపల్లి, రాంభోజీగూడెం వాగుల నుంచి ఇసుక తరలింపును అడ్డుకున్నా కాంట్రాక్టర్లు మళ్లీ పొక్లెయిన్లతో తోడుతున్నారని, దీంతో బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందరరాంరెడ్డి అన్నారు. స్ధానిక అవసరాలకే ఇసుకను వాడాలని, భారీ ప్రాజెక్ట్‌కు తరలించొద్దన్నారు. 20 ఏళ్ల క్రితం 30 ఫీట్ల లోతున్న ఇసుక నేడు రెండు మీటర్లకు తగ్గిందన్నారు. వాగుపైన నిర్మించిన రిజర్వాయర్ల వల్లే ఇసుక కిందికి రావడంలేదని, దీనిని గమనించి అధికారులు ఇసుక తోడడాన్ని ఆపాలని ఆయన కోరారు.