GWMC | వరంగల్, డిసెంబర్ 29 : బల్దియాలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ల దందా నడుస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.187.32 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఒక్కసారిగా పర్సంటేజీలు తెరమీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లు.. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడంతో కమీషన్లు ఇచ్చయినా సరే పెండింగ్ బిల్లులు క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ పర్సంటేజీ ఫిక్స్ చేస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని కొర్రీలు పెడుతున్నారు. దీంతో కాంట్రాక్టర్ల తరపున కొంత మంది సీనియర్లు ప్రజాప్రతినిధులు, అధికారులతో రెండు దఫాలు చర్చలు జరిపి కమీషన్‌పై అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా తెరపైకి రాకుండా వారి బినామీలతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
ఒక్కో బిల్లు చొప్పున కాకుండా జారీ చేసిన చెక్కుల మొత్తానికి ఒకేసారి పర్సంటేజీ ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేర్వేరుగా చెల్లించేందుకు కాంట్రాక్టర్లు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే రెండు రకాల ఒప్పందాల్లో జీడబ్ల్యూఎంసీ నుంచి నేరుగా చెల్లింపులు జరిపితే 10 శాతం, ఆర్థిక శాఖ నుంచి చెల్లిస్తే 7 నుంచి 8 శాతం కమీషన్ ఇచ్చేలా అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో అధికారులు పెండింగ్ బిల్లుల తయారీలో నిమగ్నమయ్యారు. రెండేళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయనున్నారు. ఒకేసారి రూ. 100 కోట్ల బిల్లులు చేస్తున్నట్లు సమాచారం.
బిల్లుల చెల్లింపుల్లో రెండు రకాల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ప్రభుత్వం రూ. 187.32 కోట్ల నిధులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)కి కేటాయించింది. అయితే ఆ నిధులు హైదరాబాద్ రెవెన్యూ శాఖలో ఉన్నాయి. వాటిని జీడబ్ల్యూఎం సీ అకౌంట్లో జమ చేస్తారా? లేదా అర్థిక శాఖ నేరుగా కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తుందా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ప్రధానంగా ఇదే చర్చకు వచ్చినట్లు సమాచారం. మున్సిపల్ అకౌంట్లో జమ చేస్తే కాంట్రాక్టర్ల బిల్లులు సులువుగా ఇక్కడే క్లియర్ అవుతాయి.
రాష్ట్ర అర్థిక శాఖ నుంచి అయితే బల్దియా అధికారులు కాంట్రాక్టర్ల బిల్లుల చెక్కులు హైదరాబాద్‌లోని ఆర్థిక శాఖకు పంపించాల్సి ఉంటుంది. దీంతో కాంట్రాక్టర్లు మళ్లీ హైదరాబాద్ చుట్టూ తిరాగాల్సి వస్తుందని, అక్కడ పర్సంటేజీలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. మున్సిపల్ అకౌంట్ నుంచి అయితే ఒక లెక్క, ఆర్థిక శాఖ నుంచి చెల్లిస్తే మరోలా ఇస్తామని కాంట్రాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ఇలా రెండు పద్ధతుల్లో పర్సంటేజీలు ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.