భూపాలపల్లి రూరల్/ ములుగు రూరల్/ మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 2 : నీతి అయోగ్ ప్రకటించిన సంపూర్ణతా అభియాన్ అవార్డుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండు స్థానంలో నిలిచింది. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆయా జిల్లాల కలెక్టర్లు రాహుల్‌శర్మ, టీఎస్ దివాకర అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్‌శర్మ మాట్లాడుతూ నీతి అయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆస్పిరేషనల్ జిల్లాలు, బ్లాక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జిల్లాలు, మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచి మూడు సిల్వర్ మెడల్స్ సాధించిందన్నారు.
ఈ మేరకు కృషి చేసిన అధికారులు సిబ్బందిని ఆయన అభినందించడంతో పాటు రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. దివాకర అవార్డుకు కన్నాయిగూడెం ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, ప్రజలను ఆయన అభినందించారు. అలాగే మహబూబాబాద్ జిల్లాకు సైతం సిల్వర్ మెడల్ రాగా, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ అందుకున్నారు.