సుబేదారి/హనుమకొండ, అక్టోబర్13 : దళిత ఉద్యోగినిపై లైంగిక వైధింపులకు పాల్పడిన హనుమకొండ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహైల్ అక్కడే ఆఫీస్ సబార్డినేట్పై ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రంజిత్ తెలిపారు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఇర్ఫాన్ సోహైల్‌ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించి, ఉద్యోగం నుంచి తప్పించి, అతడి భాగోతాలపై పూర్తి విచారణ జరిపించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు పుట్ట రవి, దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు చుంచు రాజేందర్, మాలమహానాడు నాయకుడు మన్నె బాబురావు అధికారులను డిమాండ్ చేశారు.
గత నెలలో సీనియర్ అసిస్టెంట్‌పై బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా రాత్రికిరాత్రే అతడిని చింతగట్టు ఎస్పారెస్పీకి బదిలీ చేశారు. ఆ తర్వాత ఐసీసీ కమిటీని అత్యవసరంగా నియమించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. విచారణలో ఇర్ఫాన్ సోహైల్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని నివేదిక ఇవ్వగా, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ స్నేహా శబరీష్ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తదుపరి చర్యల కోసం కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.