హనుమకొండ, మే 16 : నయీంనగర్ నాలాతో పాటు వంతెనల నిర్మాణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధికాగుప్తాతో కలిసి నయీంనగర్ నాలా నిర్మాణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సర్వే విభాగ అధికారులతో కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసినందున ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిషరించి నాలుగైదు రోజుల్లో నిర్మాణ పనులను ఎకడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. మూడు రోజుల్లో సర్వే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే అనంతరం ఈ పనులపై మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో వెంకటేశ్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు పాల్గొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో కాజీపేట, హనుమకొండ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, మైనర్ రిపేర్లు ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో అబ్దుల్ హై, ఈఈ సంజయ్ కుమార్, డీఈలు సంతోష్ బాబు, రవికుమార్, శివానంద్ పాల్గొన్నారు.