వరంగల్ చౌరస్తా, అక్టోబర్16 : వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆమె గురువారం దవాఖాన భవన నిర్మాణ పనులు పరిశీలించి, ఆర్అండ్బీ, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రారంభో త్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు. సివిల్ వర్క్స్, ప్లంబింగ్, సానిటేషన్, తదితర విభాగాల వారీగా పనులను అడిగి తెలుసుకున్నారు.
ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఎంజీఎం వైద్యాధికారులు, ఆర్ అండ్ బీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా కేటాయించిన అంతస్తుల్లో పనుల తీరును, కేటాయించిన స్థలంలో వైద్యసేవలు అందించడానికి వీలుగా చేపట్టాల్సిన మార్పులను సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, విభాగాధిపతులు, ఆర్అండ్బీ అధికారులు, ఎల్అండ్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.