ఖిలావరంగల్, అక్టోబర్ 30: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో 31,800 దరఖాసులు రాగా, ఇప్పటి వరకు 1957 దరఖాస్తులు మాత్రమే పరిశీలించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వాన్ని వీడి అంకితభావంతో దరఖాస్తులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పరిశీలన బృందం నిత్యం కచ్చితంగా 20 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని, రెవెన్యూ, మున్సిపల్, సాగునీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో టీపీ రత్నకుమారి, డిప్యూటీ సీటీ ప్లానర్ రవీంద్ర పాల్గొన్నారు.
జిల్లాలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఆమె సివిల్ సప్లయ్, రైస్ మిల్లర్లతో సమీక్షించారు. ప్రస్తుతం 14 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను వాయిస్ రికార్డర్ ద్వారా గ్రామాలు, ముఖ్య కూడళ్లలో కార్యదర్శులు ప్రజలకు వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వకూడదన్నారు. మిగితా మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీతో ధాన్యం కేటాయిస్తామన్నారు. సన్నం, దొడ్డు రకం వడ్లను గుర్తించేందుకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఏవో అనురాధ, డీసీవో నీరజ, డీఎం సంధ్యారాణి, డీసీవో కిష్టయ్య, డీఎంవో సురేఖ, అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్, బూరాల సత్యనారాయణ, గంధం నరేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పర్యాటక, చారిత్రక స్థలాల సందర్శన కోసం ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు ఉచితంగా పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఈవో జ్ఞానేశ్వర్, బీసీ సంక్షమ అధికారి పుష్పలత, మైనారిటీ అధికారి సౌజన్య, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.