ఖిలావరంగల్, జూన్ 20: పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటి నుంచి బయటపడేందుకు వైద్యుల సూచన మేరకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారదదేవి కోరారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఖిలావరంగల్ మధ్యకోటలోని ఆరెళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ అల్బెండజోల్ మాత్రలు వేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు మాత్రలు వేసుకోవాలని సూచించారు. వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సెలవులో ఉన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మాత్రలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,90, 718 మంది అర్హులు ఉన్నారన్నారు. ఆశా, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలతోపాటు వైద్య ఆరోగ్య శాఖలోని సూపర్వైజర్ కేడర్ సిబ్బంంది ద్వారా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. ఈ మాత్రలు తీసుకున్న పిల్లలకు ఏమైనా సమస్య ఏర్పడితే ప్రతి ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు, డివిజన్ల వారీగా పర్యవేక్షిస్తారన్నారు. విద్య, సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమానన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు మాత్రలు వేసుకొని పిల్లలు ఈ నెల 27న వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, డీఈవో వాసంతి, అభ్యుదయ సేవామతి అధ్యక్షుడు పరశురాములు, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హైమావతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రకాశ్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ నరేశ్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట/ఖానాపురం: నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నర్సంపేట పట్టణం, దుగ్గొండి మండలంలోని పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు మాత్రలు అందించారు.
కార్యక్రమంలో డాక్టర్ వనమాల, ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్, అంగన్వాడీ టీచర్ భారతి పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో సంజీవరావు, సంజయ్‌కుమార్, మల్లారెడ్డి, కోమల, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట మండలంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు విద్యార్థులకు అల్బెండజోల్ గోళీలు అందజేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖానాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. 1 నుంచి 19 ఏళ్లలోపు వారు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని కోరారు. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి జ్యోతి, హెచ్ఎం దూళం రాజేందర్, పీహెచ్సీ సిబ్బంది సునీత పాల్గొన్నారు.
రాయపర్తి/పర్వతగిరి/కాశీబుగ్గ/గీసుగొండ/చెన్నారావుపేట: నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత పెరుగుతుందని అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ సుధార్‌సింగ్ అన్నారు. రాయపర్తి జడ్పీహెచ్ఎస్లో ఆయన విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తహీనత, చదువుపై శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సురేశ్, హెడ్మాస్టర్ కృష్ణమూర్తి, అంగన్వాడీ సూపర్వైజర్ సత్యవతి, ఏఎన్ఎం జయలత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పర్వతగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో శంకర్ అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి ప్రశాంతితో కలిసి పిల్లలకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పాక రమేశ్‌బాబు, ఎంపీటీసీ మాడుగుల రాజు, కార్యదర్శి రఘు పాల్గొన్నారు.
వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి పాఠశాలలో పిల్లలకు మాత్రలు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎర్రబెల్లి నర్సింగరావు, వైద్య సిబ్బంది అరుణ, లావణ్య పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. మండలంలో 10,512 మంది పిల్లలకు మాత్రలు వేసినట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, సూపర్వైజర్ కిరణ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండల వైద్యాధికారి డాక్టర్ సరోజ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ మాత్రలు అందించారు. ఎంపీడీవో గోవిందరాజు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.