వచ్చారు.. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. కానీ, ఏం చేస్తారో తేల్చకుండానే వెళ్లారు.. ఇదీ మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం తీరు.. జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డలో లక్ష్మీబరాజ్‌ను సీఎంతో పాటు మంత్రులు పరిశీలించడం, ప్రాజెక్టుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు చూస్తే ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందాన్ని తలపించింది. మొత్తంగా మేడిగడ్డ వద్ద మంగళవారం కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన కార్యక్రమమంతా మహా హంగామాలా కొనసాగింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బరాజ్ వద్దకు మంగళవారం మధ్యాహ్నం 3.40 గంటలకు చేరుకొని కుంగిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బరాజ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం వద్దకు 4.35 గంటలకు వచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వేదికపైకి రాగా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తన వాహనంలో వెళ్లారు. నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూసిన అనంతరం రేవంత్‌రెడ్డి తిరిగి 5.04గంటలకు వేదికపైకి చేరుకున్నారు. వేదికపై కేవలం మంత్రులకు మాత్రమే కుర్చీలు వేయగా ఎమ్మెల్యేలు కూడా అక్కడికే వచ్చారు. ఈ క్ర మంలో కొంతసేపు ఎమ్మెల్యేలు కుర్చీల్లేక అయోమయానికి గురయ్యారు. దీంతో కలెక్టర్ భవేశ్‌మిశ్రా మరి కొన్ని కుర్చీలు తెప్పించి ఎమ్మెల్యేలను వేదికపై కూర్చోబెట్టారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రు లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ విన్నారు. కాగా తాజాగా మరోమారు సీఎం రేవంత్‌రెడ్డి ఇన్చార్జి ఈఎన్సీ సుధాకర్‌రెడ్డితో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పించారు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రంజన్ బరాజ్ పరిస్థితిపై విచారణకు సంబంధిం చి ప్రజంటేషన్ ఇచ్చారు.
అయితే అవినీతి అక్రమాలపై కాకుండా బరాజ్‌లోని టెక్నికల్ విషయాలపై విజిలెన్స్ డీజీ రంజన్ ఓ ఇంజినీర్లా స్క్రీన్‌పై ప్రజంటేషన్ ఇవ్వడంపై ఇంజినీర్లు అసహనానికి గురయ్యారు. సుమారు రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. సమావేశానికి హాజరైన మహదేవ్పూర్ ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణను పోలీసులు వేదిక వైపు కుర్చీల్లోకి అనుమతించలేదు. దీంతో వారు పోలీసులు, అధికారులతో వా గ్వాదానికి దిగారు. అయినా అ నుమతించకపోయేసరికి ప్రెస్గ్యాలరీలో కూర్చున్నారు. సమావేశం ఆద్యంతం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కోణంలోనే సీఎం అధికారులతో అడిగి మరీ సమాధానాలు చెప్పించుకున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా చివరికి ఎటూ తేల్చకుండా వెళ్లిపోయారు. బరాజ్‌ను రిపేరు చేయిస్తారా.. మొత్తానికే వదిలేస్తారా.. అసలు టెక్నికల్ విచారణ ఎందుకు ప్రా రంభం కావడం లేదు.. ఎల్అండ్టీతో పనులు చేయిస్తా రా.. వర్షాకాలం రాబోతున్నది.. బరాజ్ పరిస్థితి ఏమిటి అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ‘ఎన్డీఎస్ఏ విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటాం.. అవసరమైతే తుమ్మిడిహట్టి నిర్మిస్తాం’ అంటూ దాటవేస్తూ వెళ్లిపోయారు.