గీసుగొండ/హనుమకొండ, జూన్ 24 : ఈనెల 28న సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు రానున్నట్లు తెలిసింది. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పార్కును సందర్శిస్తారని, పార్క్‌లో ఏర్పాటైన పరిశ్రమలు, మౌలికవసతుల కల్పనపై పార్కులోనే టీఎస్ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై టీఎస్ఐఐసీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సోమవారం పార్కును సందర్శించారు. పరిశ్రమలు, పార్క్‌కు కేటాయించిన భూముల వివరాలతో కూడిన మ్యాప్‌తో పాటు హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఇప్పటికే పార్కులో రెండు పరిశ్రమలు ఉత్పత్తి కొనసాగిస్తున్నాయని, కిటెక్స్ కంపెనీ నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నదని అధికారులు వివరించారు. జోనల్ మేనేజర్ సంతోశ్‌కుమార్, తహసీల్దార్ రియాజుద్దీన్ ఉన్నారు. అదేవిధంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలిసింది.