హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హనుమకొండకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే వరంగల్-కరీంనగర్ రహదారిపై నయీంనగర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పూర్తయిన వంతెన నిర్మాణాన్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తుండగా ప్రాంగణానికి ఇందిరా మహిళాశక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు.
ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రెవెన్యూకాలనీ నుంచి గ్రౌండ్లోకి వచ్చేందుకు అడ్డుగా ఉన్న చెట్లను, విద్యుత్ స్తంభాలను తొలగించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మైదానంలోకి వచ్చేందుకు అడ్డుగా ఉన్న ప్రహరీలను కూల్చివేశారు. వేదిక వెనుక వైపు నుంచి వచ్చేందుకు మూడు మార్గాల ద్వారా గోడలను తొలగించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సభకు పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద ఏర్పాట్లను పర్యవేక్షించారు. రూట్‌మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.