ఓరుగల్లు ఆణిముత్యం, తెలంగాణ యువ పారా అథ్లెట్ జీవంజి దీప్తిని విశిష్ట పురస్కారమైన అర్జున అవార్డు వరించింది. కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో పరుగుల రాణికి చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తంకాగా, ఆమె స్వగ్రామం పర్వతగిరి మండలం కల్లెడ మురిసిపోయింది. పేదిరికం, వైకల్యం రూపం లో చిన్నప్పటి నుంచే ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో సవాళ్లను ఎదుర్కొని ఆమెకే సొంతమైన చిరుత వేగంతో విజయ తీరాల వైపు పరుగు తీసింది. తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే ఎన్నో పతకాలతో పాటు ఇటీవలి పారాలింపిక్స్‌లో సత్తాచాటి ప్రపంచ రికార్డు సాధించింది. ఆమె పట్టుదల, క్రీడా అభిమానుల సహ కారంతో ఇవాళ అరుదైన గౌరవం దక్కడం నేటి యువ తకు స్ఫూర్తిదాయకం. ఈ నెల 17న రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా దీప్తి అర్జున అవార్డు అందుకోనున్నారు.
– పర్వతగిరి, జనవరి 2
కల్లెడకు చెందిన జీవంజి దీప్తిది పేద కుటుంబం. చిరుత వేగం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. బరిలోకి దిగితే ఆమెకు ఆమే సాటి. పేద కుటుంబంలో పుట్టినా చిన్నప్పటి నుంచి పరుగుపందెంలో తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. గ్రామంలోని ఆర్డీఎఫ్ పాఠశాలలో జీవంజి దీప్తి విద్యాభ్యాసం చేస్తూ తన నాల్గో తరగతి నుంచే రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఇంటి నుంచి పాఠశాలకు.. పాఠశాల నుంచి ఇంటికి పరుగెత్తుతూనే వెళ్లేది. ఆమెలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన ఆర్డీఎఫ్ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రామ్మోహన్రావు దీప్తిని క్రీడల వైపు ప్రోత్సహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కోచ్ ద్వారా ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అథ్లెటిక్స్‌లో జిల్లా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపడంతో 2016లో పాఠశాల స్థాయిలోనే ‘సాయ్’ శిక్షణకు ఎంపికైంది. శిక్షణ తీసుకుంటూ అక్కడే విద్యాబ్యాసం కొనసాగించింది. ఓ వైపు తొర్రూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేసి, 2016లో కరీంనగర్లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల, 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించింది.
దీప్తి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి : మంత్రి కొండా సురేఖ
మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కుంగిపోకుండా తన శక్తి సామర్థాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. దీప్తి మా సహకారం ఎల్లవేళలా ఉం టుంది. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా. తెలంగాణ రాష్ర్టానికి పేరు తీసుకొచ్చిన అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
అవార్డు గర్వకారణం : మాజీ మంత్రి ఎర్రబెల్లి
జీవంజి దీప్తికి అర్జున అవార్డు రావడం ఎంతో గర్వకారణమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని దీప్తి విజయం నిరూపించించింది. పారాలింపిక్స్ క్రీడా విజేత జీవంజి దీప్తికి అర్జున అవార్డు వరించడం నేటి యువతకు స్ఫూర్తినింపిందని ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు ప్రశంసించారు.
ఇటీవల దీప్తి సాధించిన ఘన విజయాలు
2022 సెప్టెంబర్‌లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ లో 400 మీటర్ల పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022 నవంబర్‌లో ఆస్ట్రేలియాలో ఏషియా గేమ్స్ లో 200 మీటర్ల లో బంగారు పతకం, 400 మీటర్లలో బంగారు పతకం, ప్రాన్స్‌లో ఏషియా గేమ్స్ 2023 జూన్‌లో 200 మీటర్లలో సిల్వర్ మెడల్, 400 మీటర్లలో సిల్వర్ మెడల్, చైనాలో 2023 అక్టోబర్‌లో ఏషియన్ పారా గేమ్స్‌లో 400 మీటర్లలో బంగారు పతకం సాధించింది. జపాన్‌లో 2024 మేలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పోటీలలో బంగారు పతకం సాధించింది.
దీప్తికి డీవైఎస్వో అభినందనలు
హనుమకొండ చౌరస్తా, జనవరి 2 : పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడంపై హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్ అభినందనలు తెలిపారు. కల్లెడ నుంచి మొదలు పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగిన దీప్తి ప్రస్థానం యువ క్రీడాకారులకు ఆదర్శనీయమన్నారు.