నర్సంపేట రూరల్, జనవరి 7 : ‘తెలంగాణ ఏర్పడిత తర్వాత నిరు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వెయ్యికి పైగా ఏర్పాటు గురుకులాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులను కల్పించడంతో పాటు సుశిక్షితులైన ఉపాధ్యాయులను నియమించింది. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ శివారులోని శ్రీ గురుకుల విద్యాలయ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించొచ్చన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారులోని శ్రీ గురుకుల విద్యాలయ స్వర్ణోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి, ప్రత్యేక అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. తొలుత సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సంకల్ప బలం గట్టిగా ఉంటేనే ఫలితాలు బాగుంటాయన్నారు.
తెలంగాణలో 1150 జూనియర్ కళాశాలలకు చెందిన గురుకులాలు, మరో 85 డిగ్రీ కళాశాలలకు చెందిన గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. గురుకులాల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించాలన్నదే సీఎం లక్ష్యమని, ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మరువొద్దని సూచించారు. గురుకులాల విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. శ్రీ గురుకుల విద్యాలయం 50 సంవత్సరాల క్రితం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైందని, ఇందులో చదివిన వేలాది మంది దేశ, విదేశాల్లో స్థిరపడడం అభినందనీయమన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం..ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటకు గోదావరి జలాలు తీసుకొచ్చామనని, రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. నర్సంపేట డివిజన్లో పుష్కలంగా సాగునీరు అందుతోందని, గోదావరి జలాల రాకతో ఎటు చూసినా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయన్నారు. నర్సంపేట డివిజన్ విద్యారంగంలో చాలా అభివృద్ధి చెందిందన్నారు. డివిజన్లో సాగు, తాగు నీటిని మెరుగుపర్చామని, రూ.5 కోట్లతో చేపట్టిన పాకాల ఆడిటోరియం పనులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలో ప్రారంభిస్తామని వివరించారు. విదేశాల్లో స్థిరపడిన వారు ఇక్కడి నిరు పేదలకు సహాయం అందించాలని చెప్పారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను శ్రీ గురుకుల వ్యవస్థాపకుడు మోతె సమ్మిరెడ్డి సన్మానించారు.