వరంగల్ : సీఎం కేసీఆర్ ప్రజా బాంధవుడని, తెలంగాణ ప్రజల కండ్లలో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు.
ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న మూడురోజుల వేడుకలలో భాగంగా.. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో దివ్యాంగులకు, వృద్ధులకు పండ్లుపంపిణీ చేశారు.
అనంతరం పైడిపల్లి గ్రామంలో దివ్యాంగుల కోసం 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ భూమి పూజ చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శిభారాణి, తూర్పాటి సులోచన, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అలాగే వరంగల్ ఓసీటీ మైదానంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా దివ్యాంకులకు, వృద్ధులకు అనాథలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహా మృత్యుంజయ సహిత చండి హోమం నిర్వహించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేసారు.